Severe damage due to Heavy floods: ఉగ్ర గోదావరి హోరు.. నిండా మునిగి ఉన్న ఇళ్లు.. బాహ్య ప్రపంచానికి వచ్చేందుకు గట్లపై ఎదురుచూస్తున్న జనం. వరద వెనక్కు వెళ్లడంతో తేలిన ఇళ్లలో పేరుకుపోయిన బురద.. వరద ఉద్ధృతికి పాడైన గృహోపకరణాలు.. నీటిలో నాని ముక్కిపోయిన బియ్యం.. రోడ్డుపై ఆరబెట్టిన దుస్తులు.. ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు.. ఆహారం కోసం ఎదురు చూస్తున్న బాధితులు..పునరావాస కేంద్రాల్లో నిర్వాసితుల గోడు.. ఎవరిని కదలించినా నిరాశ.. నిర్వేదం. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో వరద గోదావరి సృష్టించిన విలయం మాటలకు అందని రీతిలో ఉంది. మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్, రాంనగర్, పద్మశాలినగర్, రెడ్డికాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, గణేశ్‌నగర్, బాలాజీనగర్, గౌతమినగర్, పాత మంచిర్యాలల్లోనూ ముంపు తీవ్రత కనిపించింది. మొత్తంగా ఆయా ప్రాంతాల్లోని దిగువ మధ్య తరగతి కుటుంబాలకు రూ.వేలల్లో నష్టం వాటిల్లగా.. మధ్య తరగతి కుటుంబాలు రూ.లక్షల ఆస్తిని పోగొట్టుకొని నడిరోడ్డుపై నిలబడ్డాయి. సాయం కోసం ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి జారుకున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద బీభత్సంపై ‘ఈటీవీ భారత్' ప్రత్యేక కథనాలు..
బురద మిగిల్చిన వరద.. ఇళ్లు శుభ్రం చేసుకోవడమే పని..
ఎవరిని కదిలించినా నిరాశ.. నిర్వేదం.. భవిష్యత్తుపై బెంగ. దిగువ మధ్య తరగతి కుటుంబాలకు రూ.వేలల్లో నష్టం వాటిల్లగా.. మధ్య తరగతి కుటుంబాలు రూ.లక్షల ఆస్తిని పోగొట్టుకొని నడిరోడ్డుపై నిలబడ్డాయి. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితుల దీనస్థితి ఇది... పట్టణంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 4 వేల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రనష్టం చవిచూశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కాలనీలోని కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. రోళ్లవాగు నుంచి వచ్చిన వరద గోదావరి నదిలో కలిసే ప్రాంతానికి ఆనుకునే ఈ కాలనీ ఉండటంతో సుమారు 200 ఇళ్లు నీట మునిగాయి. దీంతో కాలనీ ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాల్సి వచ్చింది. రెండు రోజుల కిందటే తిరిగి ఇళ్లకి చేరుకున్నారు. అప్పటినుంచి శుభ్రం చేసుకోవడానికే వీరు పరిమితమయ్యారు. వీధుల్లో ఇళ్ల ముందర రోడ్లపై సామాన్లు దర్శనమిస్తున్నాయి. వంట చేసుకుని పిల్లలకు తిండి పెట్టడం గగనమైపోతోంది. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఇచ్చే నిత్యావసర సరకుల కోసం బారులు తీరారు. దాతలు ఇచ్చిన అరటిపండ్ల కోసం పిల్లలు పరుగులు తీస్తున్న దృశ్యాలు ఆకలితీవ్రతకు దర్పణాలుగా నిలిచాయి.
కప్పులు ఎగిరిపోయి.. గోడలు కూలిపోయి..
ఎన్టీఆర్‌నగర్‌లో దాదాపు అన్నీ కూలీల కుటుంబాలే. వీరికి వారం రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం కాలనీవాసులు సమీపంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. రాంనగర్, రెడ్డికాలనీలాంటి ప్రాంతాల్లో అయితే భవనాలూ ముంపునకు గురయ్యాయి. వాటిలోని ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు, సోఫాలు, వాషింగ్‌మెషీన్లు దెబ్బతిన్నాయి. ఒక్కో ఇంట్లో రూ.2-5 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించింది. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించకపోవడంతో పదుల సంఖ్యలో జనరేటర్లను కిరాయికి తెచ్చుకొని కాలం గడుపుతున్నారు. వరద ముంపు సమయంలో తమను సంరక్షణ కేంద్రాలకు తరలించిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ‘కలెక్టర్.., నాయకులు వచ్చి చూసివెళ్లారు. ఒక సంఘం వాళ్లు 5 కిలోల దొడ్డుబియ్యం ఇచ్చి వెళ్లారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు’ అని ఒక బాధితురాలు చెప్పారు.
కట్టలు కట్టలుగా పాములు..
పలు జనావాసాల్లో పాములు తిరుగుతూ కనిపించాయి. వరద ముంపు తగ్గడంతో అవి బయట తిరుగుతూ భయకంపితుల్ని చేశాయి. గోదావరి ఒడ్డునే నిర్మించిన ప్రభుత్వ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అయితే పదుల సంఖ్యలో పాములు కనిపించాయి. శనివారం ఆసుపత్రిని శుభ్రం చేస్తున్న క్రమంలో సిబ్బంది వాటిని చంపేశారు.