Telangana National Unity Vajrotsavam: రాష్ట్రంలో జాతీయ సమైక్యతా ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో వేడుకలకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. నిజాం నిరంకుశ పాలనలో అమరులైన అమరవీరులను స్మరించుకున్నారు. హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి భారీగా జనం హాజరయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. కోలాటాలు బతుకమ్మలు ఆడుతూ మహిళల సందడి చేశారు. ర్యాలీలో 17 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నిధులు తేకుండా.. విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్తున్నారు.. రాష్ట్రం సిద్ధించాక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో అమరవీరుల స్థూపం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో భాజపా చిచ్చుపెట్టే యత్నం చేస్తోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిలలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని.. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వరుసగా రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రులు నిధులు తేకుండా.. విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్తున్నారని ధ్వజమెత్తారు.
ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో... ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో ర్యాలీని మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. జడ్పీ సెంటర్ నుంచి సర్దార్ పటేల్ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. సిద్ధిపేటలో జరిగిన వేడుకలకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు వెళ్లగా... ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణను దేశ ధాన్యాగారంగా మార్చామని వివరించారు.