ఖమ్మం నగరపాలక సంస్థను విస్తరించాలన్న ఉద్దేశ్యంతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 10 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీన గ్రామాల ప్రజలు, నాయకులంతా ఈ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. కొందరైతే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా విలీన ప్రక్రియలో ముందడుగే వేసింది. ఏడాది గడిచినా విలీన గ్రామాల్లో అభివృద్ధి జాడ లేకపోగా... ప్రజలకు కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పన్నులు రెట్టింపయ్యాయి. అటు పంచాయతీ పాలకవర్గాలు లేక, ఇటు కార్పొరేషన్ పట్టించుకోక నానా ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. స్థానికుల బాధ అర్థం చేసుకున్న ప్రభుత్వం విలీన గ్రామాలను తిరిగి పంచాయితీలుగా ప్రకటించింది.
చట్ట సవరణ బిల్లు..
ఖమ్మం కార్పొరేషన్లో కలిసిన 10 గ్రామాల విలీన కథ రెండేళ్లలోనే ముగిసింది. ప్రజల నుంచి తీవ్రంగా ఎదురవుతున్న వ్యతిరేకతకు తోడు విలీన పంచాయతీల్లో రెండేళ్లుగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పరిస్థితి అర్థం చేసుకున్న 10 విలీన గ్రామాలకు మళ్లీ విముక్తి కల్పిస్తూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న పది గ్రామాలను కార్పొరేషన్ నుంచి తొలగించేందుకు ఈ నెల 9న అసెంబ్లీలో పురపాలక చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. కార్పొరేషన్‌కు దూరంగా ఉండటం, ఆయా గ్రామాల ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం కావడం వంటివి ప్రధాన కారణాలుగా చూపిస్తూ.. పది గ్రామాలను కార్పొరేషన్ నుంచి తొలగించేందుకు ప్రతిపాదించినట్లు బిల్లులో పేర్కొన్నారు. ఫలితంగా విలీన గ్రామాల కష్టాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది.
విలీన కష్టాలు..
ఖమ్మం నగరాన్ని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో నగరానికి సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖమ్మం గ్రామీణ మండలంలోని పెద్దతండా, ఏదులాపురం, చిన్నవెంకటగిరి, గుర్రాల పాడు, గుడిమల్ల, పోలేపల్లి, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి సాయినగర్ కాలనీ, పోలేపల్లి భద్రాద్రి కాలనీ, పోలేపల్లి నాల్గవ తరగతి కాలనీ, పోలేపల్లి పీహెచ్సీ కాలనీ గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసింది. 2011 లెక్కల ప్రకారం విలీన గ్రామ పంచాయతీల్లో మొత్తం జనాభా 25 వేల 965 మంది ఉన్నారు. ఈ మేరకు కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం 2018 ఆగస్టు 2న ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి విలీన పంచాయతీల ప్రజలు ఇబ్బందులతో సహవాసం చేశారు. స్థానిక నాయకులు, ప్రజలు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా.. ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. విలీన ప్రక్రియ ముగిసింది. రెండేళ్లు గడిచినా విలీన గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. గతంలో ఉన్న మౌలిక సదుపాయలు కూడా పోయి.. కొత్త కష్టాలు వచ్చి చేరాయి. విలీన పంచాయతీల్లోని గ్రామాల ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఉపాధి పనులు లేకపోవడం వల్ల కూలీ పనులు కరవయ్యాయి. ఇంటి పన్నులు రెట్టింపయ్యాయి. వీధి దీపాలు ఏర్పాటు చేసేవారే లేరు. పారిశుధ్య పనులు కూడా చేపట్టలేదు. తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనన, మరణ, ధృవపత్రాలు కోసం ఇబ్బందులు తప్పలేదు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్తే అక్కడ పట్టించుకునే వారే కరువయ్యారు. అదే పంచాయతీలోనే ఉంటే.. సమస్యలకు వెంటనే పరిష్కారం దొరికేవి. విలీన పంచాయతీల్లో పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పంచాయతీల ఆదాయం తీసుకున్నారు గానీ.. గ్రామాల్లో అభివృద్ధి, కనీస సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. ఇలా విలీనమైనప్పటి నుంచి రెండేళ్ల పాటు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
పంచాయతీ ముగిసింది..
ఖమ్మం కార్పొరేషన్లో పది గ్రామాలను విలీనం చేసిన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని హైకోర్టుకు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా విలీన పంచాయతీలపై 125 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విస్తరణకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు సరైనవేనని దాఖలైన 125 పిటిషన్లూ కొట్టివేస్తూ 2019 మార్చి 8న హైకోర్టు తీర్పు తీర్పు చెప్పగా.. విలీనానికి అడ్డంకులు తొలిగిపోయాాయి. 2019 మార్చి 14న కార్పొరేషన్ అధికారులు అధికారికంగా విలీన పంచాయతీల్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పంచాయతీల విలీనం ప్రక్రియ పూర్తయింది. అయితే..2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రచారానికి వచ్చిన మంత్రి కేటీఆర్ పెద్దతండాలో నిర్వహించిన సభలో విలీన గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామాలను మళ్లీ పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు విలీన పంచాయతీలు కార్పొరేషన్ నుంచి తొలగిస్తూ.. అసెంబ్లీలో సవరణ చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు విలీన గ్రామాలకు విముక్తి కల్పించినట్లు మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు అసెంబ్లీలో చట్టం ఆమోదించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామనడం సరికాదు: జగ్గారెడ్డి