భద్రాచలం సీతారాముల వారి ఆలయంలో వైభవోపేతంగా సాగిన వసంతపక్ష ప్రయుక్త సన్నాహక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల వార్షిక కల్యాణోత్సవం కమనీయంగా సాగింది.అంతకుముందు.. జరిగిన కమనీయమైన కల్యాణ క్రతువు ఆద్యంతం ఆకట్టుకుంది. సుందరంగా ముస్తాబైన నిత్య కల్యాణ మండపానికి దేవతామూర్తులను తీసుకొచ్చారు. తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి ఆరాధాన నిర్వహించారు. కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్తధారణ చేశారు.
దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మ నడుముకి బిగించగా.. దీన్ని యోక్తధారణగా పండితులు వివరించారు. సీతారాముల వారికి రక్షబంధనం కట్టి గృహస్త ధర్మం కోసం రాములవారికి యజ్ఞోపవీత ధారణ చేశారు. తాంబూలాది సత్కారాలు, కన్యావరుణం నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించగా... చూర్ణికను పఠించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేద మంత్రాలు మారుమోగుతుండగా..
జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. దీన్నే శుభ ముహూర్తంగా.. జగత్ కల్యాణంగా వైదిక పెద్దలు ఉదహరించారు. కల్యాణం తర్వాత జరిగిన ముత్యాల తలంబ్రాల వేడుక.. సీతారాముల కల్యాణ మహోత్సవానికి మరింత వన్నెతెచ్చింది.