Micro Ganesh Idol: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కేంద్రానికి చెందిన దారా ముక్తేశ్వర్ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులోని 'క్యాప్ జెమినీ' మల్టీ నేషనల్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచే చదువుతో పాటు చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే స్వయంగా పేపర్లోని చిత్రాలను గీసేవాడు. తల్లిదండ్రులు దారా బాలాజీ, నళినీకుమార్ ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వారు కావడంతో ప్రత్యేకంగా ఆధ్మాత్మిక చిత్రాలపై ఆసక్తి కనబరిచేవాడు. రామయ్య ఉత్సవ మూర్తులను గీయడంలో తనదైన శైలిని రూపొందించుకున్నాడు. కొవిడ్ మహమ్మారి విజృంభించే సమయంలో లాక్డౌన్ వల్ల ఉద్యోగ విధులను ఇంటి వద్ద నుంచే పూర్తి చేయాల్సి రావడం.. తగిన ఖాళీ సమయం దొరకడంతో తనలోని కళాకారుడికి మరింత పదును పెట్టాడు ముక్తేశ్వర్.
శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామి వారికి జరిగే ప్రతి ఉత్సవంలోని మూర్తులను, ఆభరణాలను, తదితర వస్తువులను అచ్చుగుద్దినట్లుగా రూపొందించటం.. ప్రత్యేక అలంకరణలు ఎలా అయితే రామాలయం అర్చకులు ముస్తాబు చేస్తారో అదే విధంగా చిన్న విగ్రహాలకు ముస్తాబు చేయడం ఈ యువకుడి ప్రత్యేకత. రామాలయంలో ప్రతి సోమవారం మూలమూర్తులకు ముత్తంగి అలంకరణ చేస్తారు. రామయ్య మూలమూర్తులను చిత్రీకరించి వాటిపై ముత్యాలు పొదిగి ఉన్న ముత్తంగి అలంకరణను ఎలాంటి తేడా రాకుండా అలాగే రూపొందించాడు. 2020 భద్రాచలంలో జరిగిన ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్యను వివిధ అవతారాల్లో అలంకరించిన విధంగా.. ఇంట్లోని ఉత్సవ మూర్తులకు అలాగే అలంకరణలు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ముక్తేశ్వర్.