ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో ఎవరైనా కొవిడ్ పాజిటివ్‌తో హోంక్వారంటైన్లో ఉంటే వారు వీడియోకాల్ ద్వారా ప్రమాణస్వీకారం చేయవచ్చని... మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికలో అలాగే ఓటు వేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏడో తేదీన మినీ పురపోరు మేయర్, ఛైర్ పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించిన ఆయన... మార్గదర్శకాలకు అనుగుణంగా, కొవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నిక జరగాలని చెప్పారు. పార్టీల విప్‌లకు అనుగుణంగా చేతులెత్తే విధానంలో ఎన్నిక జరుగుతుందని... మొదటి రోజు ఎన్నిక జరగకపోతే రెండో రోజు ఎన్నిక నిర్వహించాలని చెప్పారు.
ఎన్నిక ప్రక్రియను ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్‌కు అనుమతించాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికైన అభ్యర్థి కోరితే సెక్యూరిటీ కల్పించాలని ఎస్ఈసీ ఆదేశించారు. భౌతికదూరం పాటిస్తూ పెద్దహాళ్లలో పరోక్ష ఎన్నిక నిర్వహించాలని... పెద్దహాల్ లేకపోతే విశాలమైన ఆవరణలో షామియానాల కింద నిర్వహించాలని స్పష్టం చేశారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, కొవిడ్ నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే హాల్లోకి అనుమతించాలని పార్థసారథి తెలిపారు.