తెలంగాణ

telangana

ETV Bharat / city

రికార్డుస్థాయిలో కుంభవృష్టి.. 115 ఏళ్లలో మూడో అత్యధికం.. నేడూ భారీ వర్షాలు..

Rains in Telangana: రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో సెప్టెంబరు నెలలో ఎన్నడూ లేనంత అత్యధిక వర్షపాతం తాజాగా నమోదయ్యింది. 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 35.1 సెంటీమీటర్లు.. రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 115 ఏళ్లలో మూడో అత్యధిక వర్షపాతమిది. నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. గోదావరిలో వరద దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు.

Rains in Telangana
Rains in Telangana

By

Published : Sep 12, 2022, 10:38 AM IST

Rains in Telangana: రికార్డుస్థాయిలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్ల సెప్టెంబరు నెలలో ఎన్నడూలేనంత అత్యధిక వర్షపాతం తాజాగా నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 35.1 సెంటీమీటర్లు, రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8, మర్తనపేటలో 20.3, ఎల్లారెడ్డిపేటలో 19.3 మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో 18, టేక్మాలులో 17.9, కొల్చారంలో 17.6, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో 16.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత పదేళ్లలో సెప్టెంబరు నెలలో 24 గంటల వ్యవధిలో 35.1 సెం.మీ.ల వర్షం కురవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు అత్యధికంగా 2019 సెప్టెంబరు 18న నల్గొండలో 21.8 సెం.మీ.లు కురిసినట్లు వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. వాయుగుండం వల్ల కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కారుమేఘాలేర్పడి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

మూడో అత్యధిక వర్షపాతం నమోదు.. తెలంగాణలో 1908 నుంచి ఇప్పటివరకూ 24 గంటల వ్యవధి(ఒకరోజు)లో అత్యధిక వర్షం ఖమ్మం జిల్లా కోహెడలో 1996 జూన్‌ 17న 67.5 సెంటీమీటర్లు, రెండో అత్యధిక రికార్డు 1983 అక్టోబరు 6న నిజామాబాద్‌లో 35.5సెం.మీ.లుగా నమోదైంది. తాజాగా ఆళ్లపల్లిలో నమోదైన 35.1 సెం.మీ.ల వర్షపాతం మూడో అత్యధికం. ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30గంటల వరకూ 11గంటల వ్యవధిలోనే కాటారం (జయశంకర్‌ జిల్లా)లో 10.1, అబ్దుల్లాపూర్‌(నిర్మల్‌)లో 8.9 సెం.మీ.ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. సిరిసిల్ల జిల్లాలో వాగులో కారు మునిగిన ఘటనలో అమ్మమ్మ, మనవడు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. కరీంనగర్‌ జిల్లా గోపాల్‌పూర్‌ డ్యామ్‌లో ఓ వ్యక్తి మృతదేహం లభించగా నిజామాబాద్‌ జిల్లాలో కాలువలో ఒకరు గల్లంతయ్యారు.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి..భారీ వర్షాలకు సిరిసిల్లలోని శనివారం అర్ధరాత్రి నుంచి పెద్దచెరువు, జంగమయ్యకుంట, శుద్దగండి, కొత్త చెరువులు అలుగు పారాయి. వెంకంపేట, అశోక్‌నగర్‌, అనంతనగర్‌, సంజీవయ్యనగర్‌, శాంతినగర్‌, శ్రీనగర్‌ కాలనీలను వరద ముంచెత్తింది. పాత బస్టాండ్‌ నుంచి కొత్త చెరువు వరకు కిలోమీటరుకు పైగా రహదారి వరదతో నిండింది. ఈ వరదంతా శాంతినగర్‌ను ముంచెత్తింది. మరమగ్గాల కార్ఖానాలు నీట మునిగాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని బతుకమ్మవాగు వంతెనను ఆనుకొని నిర్మించిన అప్రోచ్‌రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దీంతో జాతీయ రహదారి-63 మీదుగా మహారాష్ట్రలోని సిరోంచా మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగారం సమీపంలో లోలెవల్‌ కాజ్‌వేను దాటుతున్న కారు వరదలో చిక్కుకుంది. అందులో ఉన్న ముగ్గురిని స్థానికులు రక్షించారు. కాటారం, మహాముత్తారం మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో పత్తి, వరి నీట మునిగాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పెంకవాగు ఉప్పొంగడంతో తిప్పాపురం పెంకవాగు, కొత్తగుంపు, కలిపాక గ్రామాలకు; కంకలవాగు ప్రవాహంతో మల్లాపురం, కర్రెవానిముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ గ్రామీణ మండలం గోపాల్‌పూర్‌ డ్యామ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

నిలిచిపోయిన రాకపోకలు..వేములవాడ సమీప చెరువులో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు వెలికితీశారు. కొడిమ్యాల ప్రధాన రహదారిపై చిలుకవాగు పొంగడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఇస్తార్‌పల్లిలో రోడ్డు తెగిపోయింది. ఎగువ మానేరు జలాశయం కాలువ కట్టతెగి ముస్తాబాద్‌ శివారులోని ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. మెట్‌పల్లిలోని లోతట్టు కాలనీల్లోకి నీళ్లు రావడంతో జనాలు అవస్థలు పడ్డారు. ఎడతెరపిలేని వర్షాలతో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మంజీర, గోదావరి పోటెత్తుతున్నాయి. బోధన్‌ మండలం సాలూర వద్ద పాత వంతెనపై నుంచి మంజీర పారుతుండటంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. మాక్లూర్‌ మండలం మానిక్‌బండార్‌ వద్ద జాతీయ రహదారిపై నుంచి, నిజామాబాద్‌-హైదరాబాద్‌ మార్గంలో రోడ్డుపై నుంచి వరద పారుతుండటంతో రాకపోకలు నిలిచాయి. మాక్లూర్‌ మండలం మానిక్‌బండార్‌ వద్ద కాలువలో మహారాష్ట్ర వ్యక్తి గల్లంతయ్యాడు. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలంలో ఆదివారం అర్ధరాత్రి పిడుగుపాటుకు 103 గొర్రెలు, 49 మేకలు మృత్యువాత పడ్డాయి.

మంజీరా వరదలో చిక్కుకున్న గొర్రెల కాపరులు..మెదక్‌ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌ గ్రామ శివారులోని మంజీరా నది వరదలో ఆరుగురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. 1500 జీవాలను మేపుకొంటూ శుక్రవారం వారు మంజీరా పాయల్లోని కుర్వ గడ్డకు చేరుకున్నారు. ఉద్ధృతి పెరగడంతో అక్కడే చిక్కుకున్నారు. వారితో ఆదివారం ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ ఫోన్‌లో మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని, జీవాలు రానిదే బయటకు రామని వారు తెలిపారు. మరోవైపు మెదక్‌ జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మెదక్‌కి చెందిన మహ్మద్‌ అమీర్‌ఖాన్‌, అల్తాఫ్‌లు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

వాగులో మునిగిన కారు.. ఇద్దరి మృతి..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం పాజుల్‌నగర్‌ శివారులోని వాగు ప్రవాహానికి ఆదివారం తెల్లవారుజామున ఓ కారు కొద్దిదూరం కొట్టుకుపోయి నీటిలో మునిగింది. అందులో చిక్కుకున్న ఓ మహిళ, రెండేళ్ల బాలుడు మృతి చెందారు. జగిత్యాల జిల్లా చల్‌గల్‌ గ్రామానికి చెందిన బొర్ర శ్రీనివాస్‌, గంగు దంపతుల కూతురు శిరీష హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు కిట్టు(2)ను తల్లి వద్దకు తీసుకువెళ్లేందుకు అమ్మమ్మ గంగు(47) ఆదివారం అద్దె కారులో పరిచయస్థుడైన మగ్గిడి నరేశ్‌, కారు డ్రైవర్‌ రిజ్వాన్‌లతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. పాజుల్‌నగర్‌ శివారులోని రోడ్యాం వాగు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కారును డ్రైవర్‌ వాగు దాటించేందుకు యత్నించగా ప్రవాహ ఉద్ధృతికి వాగులో కొద్దిదూరం కొట్టుకుపోయింది. నరేశ్‌, రిజ్వాన్‌లు కారు డోరు తెరిచి బయటికి రాగా.. వారిని పోలీసులు, స్థానికులు క్రేన్‌ సాయంతో కాపాడారు. గంగుతో పాటు చిన్నారి నీటిలో మునిగిన కారులోనే చిక్కుకుపోయి మృతి చెందారు.

ఎందుకీ వానలు..బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా బలపడి ఒడిశాపైకి వెళ్లింది. ఇది సోమవారం ఛత్తీస్‌గఢ్‌పైకి వెళ్లి బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా. మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకూ గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. నేడు భారీగా, రేపు ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రంలో కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details