తెలంగాణ

telangana

ETV Bharat / city

పంటి బిగువున కష్టాలను భరిస్తూ.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తూ.. - ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలో వృద్ధురాలి అవస్థలు

Old women pension problem in Khammam: తల్లి పండుటాకు. కుమార్తెకు చిన్నప్పుడే రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నాలుగు పదుల వయసు దాటుతున్నా.. లేచి నిలబడలేని దయనీయ స్థితి. తనకే ఒకరు ఆసరాగా ఉండాల్సిన స్థితిలో.. మంచం పట్టిన అమ్మకు ఆలనా పాలనా చూసుకుంటోంది. కష్టాలన్నింటినీ పంటి బిగువున భరిస్తూ బతుకీడుస్తున్న ఆ తల్లీ కుమార్తెలను.. కాలం పరీక్ష పెడుతూనే ఉంది. తల్లి వృద్ధాప్య పింఛను కోసం అనేక సార్లు దరఖాస్తు చేసినా.. మంజూరు కాకపోవడంతో పూట గడవటమే కష్టంగా మారింది. ఆపన్నహస్తం కోసం ఆ తల్లీకుమార్తె... దీనంగా అర్ధిస్తున్నారు.

Old women worried about pension in Khammam
Old women worried about pension in Khammam

By

Published : Dec 22, 2021, 5:36 AM IST

పంటి బిగువున కష్టాలను భరిస్తూ.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తూ..

Old women pension problem in Khammam: ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలో 75 ఏళ్ల వృద్ధురాలు చల్లా రంగమ్మ, ఆమె కూతురు వెంకట నర్సమ్మ నివాసముంటున్నారు. వారికి చిన్నపాటి ఇల్లు తప్ప మరేవీలేవు. రంగమ్మ భర్త రెండేళ్ల కిందటే చనిపోయారు. నలుగురు కూతుళ్లలో ముగ్గురికి పెళ్లిళ్లై వెళ్లిపోయారు. పెద్దకుమార్తె వెంకట నర్సమ్మ దివ్యాంగురాలు. చిన్న వయసులోనే పోలియో బారిన పడి కాళ్లు చచ్చుబడి పోయాయి. కనీసం నడవలేని పరిస్థితి ఆమెది. 45 ఏళ్లు వచ్చినా అవివాహితురాలిగానే ఉండిపోయింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తల్లిని.. కంటికి రెప్పలా చూసుకుంటోంది. వెంకట నర్సమ్మకు నెలనెలా వచ్చే ఆసరా పింఛనుతోపాటు.. కుట్టుమిషన్‌ కుట్టగా వచ్చే అంతో ఇంతో వచ్చే సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. అన్ని పనులు పాక్కుంటూ వెళ్లి చేయాల్సిన దుస్థితి ఆమెది.

పింఛన్​ కోసం దరఖాస్తు చేసినా...

తల్లి ఆలనా పాలన కోసం తనకు వచ్చే పింఛన్‌ డబ్బు సరిపోవట్లేదని.. వెంకట నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి పింఛన్‌ కోసం... ఎన్నో సార్లు అధికారులకు దరఖాస్తు చేసినా.. కనికరించలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నారు.

'మూడు వేల రూపాయల పింఛనుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. ఎవరూ మాకు సాయం చేయడం లేదు. చెల్లిళ్లు పంపే డబ్బులు అమ్మ మందుల ఖర్చుకే సరిపోతున్నాయి. 75 ఏళ్లు వచ్చినా.. అమ్మకు పింఛను రావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.'

- వెంకట నర్సమ్మ

స్థానికుల సాయం..

బయట పనులుంటే.. గతంలో మూడుచక్రాల సైకిల్‌పై వెళ్లి వెంకటనర్సమ్మ పనులు చేసుకునేవారు. కొంతకాలం క్రితం మూడు చక్రాల సైకిల్ పాడైపోయి మూలనపడింది. దీంతో.. వారికి కష్టాలు తప్పడం లేదు. బంధువులు, స్థానికులు.. తల్లీకూతురికి తమకు తోచిన సాయం అందిస్తున్నారు. 75 ఏళ్ల రంగమ్మకు వెంటనే పింఛన్‌ మంజురు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీచూడండి:'నీళ్లు ఎక్కువై నిండా మునిగిపోతున్నాం.. మమ్మల్ని ఆదుకోండి'

ABOUT THE AUTHOR

...view details