ఖమ్మం నగరపాలక ఎన్నికల్లో తెరాస నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస నుంచి మొత్తం 163 నామినేషన్లు దాఖలయ్యాయి. 60 డివిజన్లలో తెరాస అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా డివిజన్లలో ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. సీటు ఆశించి భంగపడ్డ వారిలో కొందరు నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డారు. ఇలాంటి వారిపై ముందు నుంచే దృష్టి సారించిన తెరాస.. అసంతృప్తులను బుజ్జగించడంలో కొంతమేర సఫలమైంది. కొన్ని డివిజన్లలో తెరాస- సీపీఐ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 125 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని డివిజన్ల నుంచి ఆ పార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి 84 నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 51 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికల్లో భాజపా- జనసేన పార్టీలు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. జనసేన పార్టీ నుంచి 12 నామినేషన్లు వేశారు. సీపీఎం పార్టీ నుంచి 35 నామినేషన్లు, సీపీఐ తరపున 7 నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా నుంచి 16 నామినేషన్లు దాఖలు చేశారు. 4 డివిజన్లలో న్యూడెమోక్రసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. అన్ని డివిజన్లలో కలిపి స్వతంత్రులు 76 మంది నామపత్రాలు అందజేశారు. అత్యధికంగా 43వ డివిజన్లో 14 మంది అభ్యర్థులు 18 నామినేషన్లు దాఖలు చేశారు.
ముగిసిన తొలి అంకం... పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై పార్టీల దృష్టి
ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల పర్వంలో తొలి అంకం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోలాహలంగా సాగింది. 60 డివిజన్లకు గానూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 522 నామపత్రాలు దాఖలయ్యాయి. 417 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరినాడు ఒక్కరోజే 377 నామపత్రాలు దాఖలయ్యాయి.
నామినేషన్ల పర్వం ముగిసినందున పొత్తులు- సీట్ల సర్దుబాట్లపై రాజకీయ పార్టీలు దృష్టి సారించనున్నాయి. తెరాస- సీపీఐ పొత్తుపై ఇప్పటికే స్పష్టత రాగా.. సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రావాల్సి ఉంది. సీపీఐ 4 స్థానాలు కోరుతుండగా.. 3 ఇచ్చేందుకు తెరాస అంగీకరించింది. మరోస్థానం కోసం సీపీఐ పట్టుబడుతోంది. ఇందుకోసమే మొత్తం 5 డివిజన్లలలో సీపీఐ తరఫున ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అదనంగా నామినేషన్ వేసిన రెండు డివిజన్లలో ఒక స్థానం కేటాయించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భాజపా- జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈ మేరకు పొత్తు విషయంలో రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. సీట్ల సర్దుబాటు పూర్తి కావాల్సి ఉంది. కాంగ్రెస్, తెదేపా, సీపీఎం మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మూడు పార్టీల మధ్య పొత్తులు ఖరారు కాకపోయినప్పటికీ పరస్పరం అవగాహనతో ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీలు భావిస్తున్నాయి.
ఈ మేరకు ఈరోజు మూడు పార్టీల నేతలు సమావేశమై చర్చించనున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధించి ఆ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినందున ఎలా ముందుకెళ్లాలో సమవేశంలో నిర్ణయిస్తామని వెల్లడించారు. సీట్ల సర్దుబాటు కుదిరితే పొత్తు లేకుంటే పరస్పర అవగాహనతో ముందుకెళ్లేలా కార్యాచరణ రూపొందించేలా మూడు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. 22న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.