నగరపాలక సంస్థలను మరింత అభివృద్ధి చేసేందుకు... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నూతన నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్లను పట్టణాభివృద్ధి సంస్థలుగా ఏర్పాటు చేస్తూ... నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న హైదరాబాద్, వరంగల్‌తోపాటు కొత్తగా... కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం, ఖమ్మంను పట్టణాభివృద్ధి సంస్థలుగా ఏర్పాటు చేసింది.
మూడేళ్ల ఎదురుచూపు
ఖమ్మం నగరంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం పేరు మీదుగా... 2017 అక్టోబర్ 24న స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాలు, ఖమ్మం గ్రామీణం, కూసుమంచి, చింతకాని, వైరా, కొణిజర్ల మండలాల్లో కొన్ని గ్రామాలు.. మొత్తం 46 గ్రామాలు సుడాలో కలిశాయి. కానీ... వివిధ కారణాలతో పాలకవర్గం ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు సుడా పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విధేయతకే వీరతాడు...
సుడా ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఛైర్మన్ గిరీ రాజకీయ పదవి కావడం వల్ల... తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాకు చెందిన తెరాస ముఖ్య నేతలంతా తమ అనుచరులకు ఛైర్మన్ పదవి కోసం విశ్వప్రయత్నాలే చేశారు. పలుమార్లు ప్రగతిభవన్ వరకూ వెళ్లిన ఛైర్మన్ దస్త్రం వాయిదాలు పడుతూ వచ్చించి. ప్రస్తుత రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సొంత నియోజకవర్గ కేంద్రం కావడం వల్ల... తన అనుచరుడికే ఇవ్వాలని ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే గట్టిగా పట్టుబట్టారు. చివరకు పంతం నెగ్గించుకున్న మంత్రి అజయ్... విధేయుడు బచ్చు విజయ్‌కు ఛైర్మన్ గిరీ ఇప్పించుకున్నారు.