Harish Rao Khammam Tour: ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు తెరాస శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద తెరాస నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం చేరుకున్న మంత్రి హరీశ్‌రావు.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా రూ.7.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రామాకేర్ విభాగం, ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అనంతరం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన తల్లి పాల నిల్వ నిధి కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇప్పటివరకు హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకే పరిమితమైన క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని.. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే క్రమంలో ఖమ్మంలో నాలుగో ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే వరంగల్‌లో క్యాథ్ ల్యాబ్ పనిచేస్తుందన్న మంత్రి.. త్వరలోనే ఆదిలాబాద్‌లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. హైదారాబాద్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో గుండె సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల ప్రాణాలు కాపాడవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీలను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
"ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రెండో దఫాలో ఫీవర్ సర్వేకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కేంద్రం ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టింది. మూడో దఫాలోనూ ఈ ఫీవర్ సర్వే కొనసాగుతుంది. వారం రోజులుగా సాగుతున్న సర్వేలో 77 లక్షల 33 వేల 427 ఇళ్లను పరిశీలించాం. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ 3 లక్షల 45 వేల 951 కిట్లు అందించాం. రోజూ లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నాం. సుమారు 2 కోట్ల కరోనా పరీక్షలకిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కోటి హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల వరకు మాత్రమే వినియోగించారు. బూస్టర్‌డోస్ సమయం 9 నెలల నుంచి 3 నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాసినా.. ఇప్పటి వరకు స్పందన లేదు. 60 ఏళ్లకు పైబడ్డ వారికే కాకుండా అందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలి." -హరీశ్‌రావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
జ్వర సర్వే నిర్వహణ పట్ల కేంద్ర మంత్రి హర్షం..