దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముకను విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద మానవహారం నిర్వహించారు.
రైతులను మోసం చేసేందుకే కొత్త చట్టాలు : తమ్మినేని - cpm leader tammineni veerabhadram in manavaharam
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో దీక్షలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఖమ్మంలో రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చట్టాలను వెంటనే రద్దు చేసి, ప్రభుత్వ మార్కెట్లను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎవరి ప్రయోజనాల కోసం మోదీ ఈ చట్టాలను చేశారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంతోపాటు ఆ రంగంపై ఆధారపడి ఉన్న మార్కెట్ వ్యవస్థలు, వ్యాపారాలు, కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని వివిధ పక్షాలకు ఆయన పిలుపునిచ్చారు. రైతుల దీక్షకు సంఘీభావంగా పోరాటం చేయాల్సిన అవసరముందని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నాయకులు దిరిశాల వెంకటేశ్వర్లు, చిన్ని కృష్ణారావు, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, నరసింహారావు, రమణారెడ్డి, సుధీర్, లింగయ్య, వెంకటేశ్వర్లు, వేణు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.