పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు కొవిడ్ ఉద్ధృతి ఉన్నప్పటికీ... ప్రజలు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీగా బారులు తీరారు. యువత, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసే సమయానికి 57.91 శాతం పోలింగ్ నమోదైంది.
కానరాని నిబంధనలు...
కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పగడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినప్పటికీ.. చాలా చోట్ల అమలు కాలేదు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల మధ్య భౌతికదూరం కనిపించలేదు. ఇంకా కొన్ని చోట్లలో అయితే... ఓటర్లు గుంపులు గుంపులుగా బారులు తీరారు. కనీస దూరం లేకుండా కేంద్రాల వద్ద కిక్కిరిసి కనిపించినప్పటికీ.. అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రాల వద్దకు సెల్ ఫోన్లు తెచ్చుకున్న వారికి కష్టాలు తప్పలేదు. కేంద్రం ప్రాంగణంలోకి కూడా పోలీసులు సెల్‌ఫోన్ అనుమతించకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు.
ఓటర్ల అయోమయం...
ఇక పునర్విభజనతో మారిన డివిజన్ల స్వరూపం, పోలింగ్ బూత్‌ల స్వరూపంతో ఓటర్లు అష్టకష్టాలు పడ్డారు. తమ ఓటు... ఏ బూత్‌లో ఉందో తెలుసుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. గంటల తరబడి వరుసల్లో నిలబడి... తీరా కేంద్రంలోపలికి వెళ్లాక... "మీ బూత్ ఇది కాదు.. మరో చోటుకు వెళ్లాలి" అని అధికారులు చెప్పడం వల్ల మహిళలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కొందరైతే ఓటేయడం తమ వల్ల కాదని వెనుదిరిగి వెళ్లిపోయారు.
పార్టీల మధ్య ఘర్షణలు...
ఇక నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎన్నెస్పీ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో తెరాస-కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ రెండు వర్గాల వారు అధికారులకు ఫిర్యాదులు చేశారు. వారి సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ పీజీ కళాశాల వద్ద తెరాస- కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర తోపులాటలతో చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఇరువర్గాలు ఒకరినొకరు అడ్డుకోగా.. తెరాస- కాంగ్రెస్ మధ్య ఘర్షణ చెలరేగింది. పలువురు కార్యకర్తలు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఖానాపురంలోనూ తెరాస- కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలు మినహా... మిగతా పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎన్నికల పరిశీలకులు నషీమ్ అమ్మద్ పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.