తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖమ్మంలో నిరుద్యోగులకు అండగా 'పుస్తక పూదోట' - ఖమ్మంలో చావా రామారావు రీడింగ్​ హాల్​

ప్రభుత్వ ఉద్యోగులైన ఆ భార్యాభర్తలు.. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు పడుతున్న అవస్థలు కళ్లారా చూశారు. సర్కారు ఉద్యోగం సాధించాలనే తపనున్నా.. ఆర్థిక పరిస్థితులు సహా ఇతర వసతులు లేక ఇబ్బందులను పడుతున్న ఉద్యోగార్థులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తమ ఇంటినే గ్రంథాలయంగా మార్చి.. సుమారు 5 వేల పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

khammam library
khammam library

By

Published : Apr 3, 2022, 6:59 AM IST

ఖమ్మంలో నిరుద్యోగులకు అండగా 'పుస్తక పూదోట'

భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. తాము కొలువులు సాధించడంతోనే ఆగిపోలేదు.. సర్కారు ఉద్యోగం సాధించాలనే తపనపడుతున్న పేద యువతకు ఆసరాగా నిలుస్తున్నారు. శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లే ఆర్థిక స్తోమత లేని అభ్యర్థులు అడిగిన పుస్తకాలతో పాటు వారికి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందు కోసం తమ ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో ఖమ్మంలో నిరుద్యోగులకు అండగా ఉన్న ఈ పుస్తక పూదోటపై ప్రత్యేక కథనం.

ఇంటినే గ్రంథాలయంగా..పేద విద్యార్థులు ప్రయోజకులవ్వాలనే ఉద్దేశంతో పారుపల్లి అజయ్‌ కుమార్‌, చావా దుర్గా భవాని దంపతులు ఖమ్మం మమతా రోడ్డులోని తమ ఇంటిని మూడేళ్ల క్రితం గ్రంథాలయంగా మార్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులుగా అజయ్‌ పదవీ విరమణ పొందగా.. దుర్గా భవాని చింతకాని మండలం పాతర్లపాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారి కోసం గ్రంథాలయంలో 5 వేల పుస్తకాలను చేర్చారు.

విధి నిర్వహణలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయటం వల్ల విద్యార్థుల ఇబ్బందులు గుర్తించే గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు పుస్తక పూదోట నిర్వాహకురాలు దుర్గా భవాని తెలిపారు. ఈ గ్రంథాలయానికి ఖమ్మం జిల్లాలోని చింతకాని, బోనకల్లు, తల్లాడ, వైరా మండలాల నుంచి పేద విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని చెప్పారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

పలువురి నుంచి ప్రశంసలు.. పేద పిల్లలకు చేయూతనందిస్తూ సొంత ఖర్చుతో పుస్తకాలు, వారికి కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్న పుస్తకపూదోట గ్రంథాలయ నిర్వాహకులను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అభినందించారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారి ఉద్యోగ సాధనలో తమ వంతు తోడ్పాటు అందిస్తున్న ఉపాధ్యాయ దంపతుల కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇదీచూడండి:New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details