ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మరో ప్రధాన ఘట్టానికి ఇవాళ్టితో తెరపడనుంది. అభ్యర్థులను తేల్చే నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. 60డివిజన్లకు మొత్తం 522 నామినేషన్లు దాఖలు కాగా... పరిశీలనలో 9 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెరాస నుంచి 101, కాంగ్రెస్ 108, భాజపా 69, తెదేపా 14 సీపీఎం 11, సీపీఐ 9, ఇతర పార్టీల వారు 15, స్వతంత్ర అభ్యర్థులు 67 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారు. ఎంత మంది పోటీలో ఉండబోతున్నారనేది నేటితో తేలిపోనుంది. ప్రధానంగా తెరాస, కాంగ్రెస్, భాజపాల నుంచి ఎక్కువ మంది ఉండటంతో వారి నామినేషన్ల ఉపసంహరణ పార్టీలకు తలనొప్పిగా మారింది.
ఖమ్మం పోరులో నిలిచేదెవరు.. పోటీ నుంచి తప్పుకునేదెవరు? - khammam corporation election లాైే
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచేదెవరు.. పోటీ నుంచి తప్పుకునేదెవరు? అనేది నేటితో తేలిపోనుంది. నేడు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు కావడంతో రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. అన్ని పార్టీలు తమ పార్టీ అభ్యర్థులెవరనే ఉత్కంఠకు తెరదించనున్నాయి.
అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటివరకు బీ-ఫారాలు అందించకపోవడం వల్ల... ఏ డివిజన్‌లో ఏ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేదు. తిరుగుబాటుదారుల బెడద లేకుండా పావులు కదిపిన పార్టీలు ఇప్పటివరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. వరంగల్‌లో అభ్యర్థుల జాబితాను విడతల వారీగా విడుదల చేసిన తెరాస.. ఖమ్మంలో మాత్రం ప్రకటించలేదు. డివిజన్ల వారీగా అభ్యర్థులను ముందే గుర్తించి వారితోనే నామినేషన్లు వేయించింది. కొన్నిచోట్ల పార్టీ టికెట్ ఆశించిన వారు నామినేషన్లు దాఖలు చేశారు. తమకే పార్టీ టికెట్ కావాలని కోరుతున్నవారిని... బుజ్జగించేపనిలో ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్, భాజపాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులతో కాంగ్రెస్ నామినేషన్లు వేయించింది. ఐతే సీపీఎంతో పొత్తు, సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు... పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశం తేలితే... అందుకు అనుగుణంగా నేతలు పార్టీల వారీగా అభ్యర్థులకు బీ-ఫారాలు అందించనున్నారు. భాజపా- జనసేన పొత్తు ఫలించడంతో... భాజపా 54, జనసేన 6 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. తెదేపా 13 డివిజన్లలో పోటీ చేస్తుండగా... అభ్యర్థులకు బీ-ఫారాలు అందించాలని నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం అభ్యర్థుల తుదిజాబితాను అధికారులు ప్రకటించిన తర్వాత బరిలో ఎవరు ఉంటారనేది తేలనుంది.