ఖమ్మం గుమ్మంలో లోక్‌సభ పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఆఖరి నిమిషంలో నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా నిలబెట్టారు గులాబీబాస్. అభ్యర్థి ఎంపికలో మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్..మాజీ ఎంపీ రేణుకా చౌదరినే రంగంలోకి దించింది. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో నామా, రేణుకా చౌదరి పోటీపడగా చెరోసారి విజయం సాధించారు. ఇప్పుడీ రాజకీయ ఉద్దండులు మూడోసారి పోరుకు సై అనడం ఖమ్మంలో రాజకీయ కాక పుట్టిస్తోంది.
ఖమ్మంలో కారు జోరు
ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీల్లో ఖమ్మంలో మాత్రమే తెరాస అభ్యర్థి పువ్వాడ గెలిచారు. వైరా స్వతంత్ర ఎమ్మెల్యే రాములు నాయక్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు కారెక్కుతామని లేఖలు విడుదల చేశారు. ఏడింట్లో ఐదు స్థానాల్లో నామాకు బలం పెరిగింది. తెదేపాలో ఉన్నప్పుడు ఉప్పునిప్పుగా ఉన్న తుమ్మల, నామా..గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులైన నామా, పువ్వాడ అజయ్, సిట్టింగ్ ఎంపీ పొంగులేటి ప్రస్తుతం ‘కారులో ప్రయాణిస్తున్నారు. నామా విజయమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ఛరిష్మా, ప్రభుత్వ పథకాలు కలిసొచ్చే అంశాలు. ఎంపీగా కొనసాగిన సమయంలో ఎక్కువమందికి గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత నామాకు ఉంది. పాలిట్రిక్స్ తెలియకపోవడం, ఇతరులపై ఆధారపడటం ప్రతికూల అంశాలు. ఎన్నికల సమయంలో తప్ప గెలిచిన తర్వాత కనిపించరనే అపవాదు మూటగట్టుకున్నారు.
పట్టుకోసం కాంగ్రెస్ పాకులాట