పోషణ అభియాన్‌లో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఐసీడీఎస్ సిబ్బంది వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఆకట్టుకుంటున్నారు. ఏన్కూరు, తిమ్మారావుపేట సెక్టార్‌లలో కేంద్రాల వారీగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే పోషకాలు ఉన్న ఆహారాన్ని తయారు చేసుకోవడం, రక్తహీనత తగ్గించుకోవడం వంటి వాటిపై గర్భిణీలు, బాలింతలకు వివరిస్తున్నారు.
పౌష్టికాహారంపై వినూత్నరీతిలో ఏసీడీఎస్ సిబ్బంది అవగాహన - khammam news
పోషకాహారంపై తల్లులకు అవగాహన కల్పించే క్రమంలో మహిళలను చైతన్య పరిచేందుకు ఐసీడీఎస్ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా ఏన్యూరు మండలంలోని సిబ్బంది పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలతో గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ క్రమంలో జిల్లాలోనే వినూత్నంగా పటాలు తీర్చిదిద్ది ఆకర్షణగా నిలుస్తున్నారు. కామేపల్లి సీడీపీవో దయామణి నేతృత్వంలో అంగన్‌వాడీలలో ఉన్న వస్తువులతో బొమ్మలు తయారు చేసి వాటి ఉపయోగాలు తెలియజేస్తున్నారు. సూపర్‌వైజర్లు వెంకటమ్మ, రేఖాబాయి, అంగన్‌వాడీలు ప్రత్యేక చొరవ చూపి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అంగన్‌వాడీ ఉపాధ్యాయునులు సైతం పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
గ్రామాల్లో పోషకాహారం ప్రతి ఒక్కరికి చేరువ చేసే క్రమంలో పెరటి తోటల పెంపకంపై శ్రద్ద చూపుతున్నారు. ఆకుకూరల పెంపకం ద్వారా మంచి పోషకాలు అందుతాయని తెలియజేయడమే కాకుండా... తల్లులు నాటుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు.