నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రధాన జలాశయాలు మొత్తం నిండుకుండను తలపిస్తున్నాయి. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు నుంచి అడుగు మేర నీరు ప్రవహిస్తుండటంతో సత్తుపల్లి, వేంసూరు మండలాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలకు నిండిన బేతంపల్లి చెరువు.. నాట్లు ప్రారంభం - సత్తుపల్లి నియోజకవర్గంలో వర్షం
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు రైతన్నల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రధాన చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. బేతంపల్లి చెరువు నుంచి అడుగు మేర దిగువకు నీరు ప్రవహిస్తోంది. దీంతో రైతులు నాట్లు ప్రారంభించారు.

బేతుపల్లి చెరువు కింద స్థిరీకరించిన ఆయకట్టు 5,730 ఎకరాలు కాగా.. అదనంగా మరో 5 వేల ఎకరాలతో కలిపి దాదాపు 10 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. బేతుపల్లి చెరువు కుడి,ఎడమ కాలువలు 23 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో చెరువు, పంట కాలువల్లో ఏళ్లుగా పేరుకుపోయిన పూడికతీత పనులు చేపట్టారు. ఫలితంగా ఆయకట్టు చివరి భూములకు కూడా సాగు నీరు ప్రవహించే అవకాశం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కురుస్తున్న వర్షాలతో ఆయకట్ట పరిథిలో నాట్లు ప్రారంభమవ్వగా, మరికొంతమంది రైతులు నాట్లు వేసేందుకు పొలాల్లో దమ్ము చేస్తున్నారు. నియోజకవర్గంలోని మధ్యతరహా జలాశయమైన లంకసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు ప్రస్తుతం 13.9 అడుగులకు చేరుకుంది.