చూడచక్కని వాడు...ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరపు వేదపండితులు కీర్తించగా... సుగుణాల రాశి, అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తిప్రతిష్టలంటూ.. సీతమ్మ తరపు అర్చకులు వేనోళ్ల పొగుడుతూ..సాగిన ఎదుర్కోలు మహోత్సవం భక్తులకు పరమానందాన్ని కలిగించింది. పోటాపోటీగా రాములోరిని, సీతమ్మ తల్లిని పొగడ్తలతో ముంచెత్తిన వేదపండితులు...చివరకు వారి జంటే ఆదర్శప్రాయమని లోకానికి చాటిచెప్పారు. రాములోరి కల్యాణ ఘట్టానికి ముందురోజు సాగిన ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు వచ్చిన భక్తకోటితో భద్రాద్రి పులకించిపోయింది.
ఆనందడోలికల నడుమ సీతారాముల ఎదుర్కోలు - edurkolu event held by yadadri
రఘువంశ రామయ్య, సుగుణాల సీతమ్మకు ఎదుర్కోల్ల ఉత్సవం కన్నుల పండువగా సాగింది. సీతారాముల వారి కీర్తి ప్రతిష్టతల్ని, వంశ విశిష్టతను కీర్తిస్తూ సాగిన కమనీయ వేడుక భక్తులను రంజింపచేసింది. అశేష భక్తకోటి జయజయ ధ్వానాల మధ్య సీతారాముల పరిణయ కార్యక్రమ ప్రధాన ఘట్టం ముగిసింది.
వీనుల విందుగా ఎదుర్కోలు
తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడైన రాములోరికి, సుగుణాల రాశి సీతమ్మ తల్లి కల్యాణానికి ముందురోజు జరిగే ఎదుర్కోలు ఉత్సవం భక్తుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తింది. వేదమంత్రోచ్ఛరణాలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీనుల విందుగా సాగింది.
భక్తుల జయజయధ్వానాల మధ్య భద్రాద్రి పురవీధుల గుండా సీతారాములు మిథిలా మైదానానికి చేరుకున్నారు. ఉత్తర ద్వారం వద్ద రామయ్య తండ్రి కొలువుదీరగా..ఎదురుగా సీతమ్మ తల్లిని ఆసీనురాల్ని చేశారు. ఆ తర్వాత వేదపండితులు, అర్చకులు పోటాపోటీగా సీతారాముల వారిని కీర్తించారు. ఎదుర్కోలు వేడుక విశిష్టత ప్రాముఖ్యతను తెలియజేస్తూనే.. జానకిరాములను కీర్తించారు. వధూవరుల వంశ కీర్తి ప్రతిష్టల్ని వివరించారు.
ఆధ్యాతం హస్య భరితం
ఎదుర్కోలు మహోత్సవం సందర్భంగా వేదపండితుల మధ్య పోటాపోటీగా సాగిన హాస్యభరిత సంభాషణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తరలివచ్చిన భక్తులు
నయనానందం కలిగించిన ఈవేడుకను చూసేందుకు భక్తులు భద్రాద్రికి భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఎదుర్కోలు వేడుకలో భాగస్వాములయ్యారు. తమ తమ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పూలు, పండ్లు, పసుపు, గోటి తలంబ్రాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను ఆద్యంతం కనులారా వీక్షించిన భక్తజనం పరవశించిపోయారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు