తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖమ్మంలో హద్దు మీరుతున్న ఆకతాయిల ఆగడాలు - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో ఆకతాయిల ఆగడాలకు హద్దూఅదుపూ లేకుండాపోతోంది. రోజురోజూ పెచ్చుమీరుతున్న ఆకతాయిల చర్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. విచ్చలవిడిగా మద్యం సేవించడం, వాహనదారులతో ఘర్షణలకు దిగడం, ర్యాష్ డ్రైవింగ్​లు, రణగోణధ్వనులు, వింతైన హారన్లతో ద్విచక్రవాహనాలు నడుపుతూ జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. సాధారణ పౌరులు, మహిళలు, వాహనదారులపై ఆకతాయిల దాడుల జరుగుతున్నా ఆయా పోలీసుస్టేషన్​లలో నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తక్కువ నమోదవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఖమ్మంలో హద్దు మీరుతున్న ఆకతాయిల ఆగడాలు
ఖమ్మంలో హద్దు మీరుతున్న ఆకతాయిల ఆగడాలు

By

Published : Sep 12, 2020, 1:26 PM IST

ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో ఆకతాయిల ఆగడాలకు హద్దూఅదుపూ లేకుండాపోతోంది. రోజురోజూ పెచ్చుమీరుతున్న ఆకతాయిల చర్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో రోడ్లపైకి రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. విచ్చలవిడిగా మద్యం సేవించడం, వాహనదారులతో ఘర్షణలకు దిగడం, ర్యాష్ డ్రైవింగ్​లు, రణగోణధ్వనులు, వింతైన హారన్లతో ద్విచక్రవాహనాలు నడుపుతూ జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రధాన రహదారులపైనా ఇష్టారాజ్యంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎటు నుంచి బైక్‌ వస్తుందో..ఎవరిని ఢీ కొడతారో తెలియక జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎవరైన ప్రశ్నించినా.. అంత వేగం ఎందుకు? అని సలహా ఇచ్చిన అంతే.. మద్యం మత్తులో విచక్షణా రహితంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.

కౌన్సెలింగ్ ఇస్తున్నా..

ఇక రాత్రి సమయాల్లో బైక్‌ రైడింగ్‌ పోటీలు, అర్ధరాత్రి నడిరోడ్లపై పుట్టిన రోజు వేడుకలు పరిపాటిగా మారాయి. మద్యం సేవించడం, అటుగా వచ్చిన వారిపై దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం అలవాటుగా మారిపోయింది. ఇటీవల అర్ధరాత్రి పార్టీలు మరీ ఎక్కువయ్యాయి. లాక్​డౌన్‌ సమయంలో చాలా వరకు తగ్గినా సడలింపులు తర్వాత తిరిగి ఎక్కువయ్యాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తున్నా.. ఆకతాయిల్లో మార్పు రావడం లేదు.

ఆకతాయిలకు అడ్డాగా నిర్మానుష్య ప్రాంతాలు..

నగరంలోని చాలా ప్రాంతాలు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి ఆ తర్వాత బైక్​లపై షికార్లు చేస్తున్నారు. బైక్ రైడింగ్ పోటీలు పెట్టుకుంటూ తెల్లవారుజాము వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో మమతారోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, బైపాస్ రోడ్, రాపర్తినగర్, కొత్త బస్టాండ్ ప్రాంతం, ఎన్నెస్పీ క్యాంపు, వరంగల్ క్రాస్​రోడ్​లలో విచ్చలవిడిగా ర్యాష్ డ్రైవింగ్​లు సాగేవి. ఈ పరంపర నగరం నడిబొడ్డుకు కూడా పాకింది. నగరంలోని ప్రధాన రహదారుల్లో రాత్రి సమయాల్లో ఒకే బైక్​పై ముగ్గురికి తగ్గకుండా ఆకతాయిలు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటం సర్వసాధారణమై పోయింది. కొత్తగూడెంలోని పాల్వంచ, నవభారత్ రోడ్డు, రైల్వేట్రాక్​లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఆకతాయిల సంచారం పెరుగుతోంది.

నమోదవుతున్న కేసులు తక్కువే!

మద్యం మత్తులో సాధారణ పౌరులు, మహిళలు, వాహనదారులపై ఆకతాయిల దాడుల జరుగుతున్నా ఆయా పోలీసుస్టేషన్​లలో నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తక్కువే. ఖమ్మం జిల్లాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆగస్టులో ఇప్పటి వరకు అతివేగం కింద 290 కేసులు చేశారు. సౌండ్ పొల్యూషన్ కింద 41 కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 520 నమోదయ్యాయి.

కొత్తగూడెం పట్టణంలో మూడు నెలల కాలంలో నిర్లక్ష్యం, అతివేగం కేసులు 75 నమోదయ్యాయి. 350 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గొడవలు, ఘర్షణలు ఎక్కువ జరుగుతున్నప్పటికీ నమోదవుతున్న కేసుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ఆకతాయిల వేధింపులకై కేసులు పెట్టేందుకు బాధితులు ముందుకు రాకపోవడమే ప్రధాన కారణం. ఒకవేళ ఎవరైనా బాధితులు పోలీసుస్టేషన్లను ఆశ్రయించినా పరిస్థితి కేసుల వరకు వెళ్లడం లేదు. ఆకతాయిలపై కేసులకు పోలీసులు సన్నద్ధమవుతుంటే... స్థానిక నేతలు ప్రత్యక్షమై కేసులు నమోదు కాకుండా రాజీ కుదురుస్తున్నారు. దాడులకు పాల్పడే వారిలో ఎక్కువమంది విద్యార్థులు ఉండటంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు.

గస్తీ మరింత ముమ్మరం చేయాల్సిందే

నేరం జరిగిన తర్వాత హడావుడి చేయడం కంటే నేరాలు జరగకుండా చేయడమే ప్రస్తుతం పోలీసుల ముందున్న తక్షణ కర్తవ్యం. లాక్​డౌన్​కు ముందు పోలీసులు డ్రంక్‌ అండ్​ డ్రైవ్‌ విరివిగా నిర్వహించే వారు. రాత్రి సమయాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆకతాయిలపై చర్యలు తీసుకునేవారు. ఇటీవలి కాలంలో కరోనా పరిస్థితులు, ఆ తర్వాత లాక్​డౌన్ నిబంధనలపై పోలీసులు ప్రధాన దృష్టి సారించడంతో ఆకతాయిల చర్యలపై నిఘా లోపించింది. ఇటీవల సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పోలీసులు మళ్లీ ఆకతాయిల ఆగడాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటంతో పాటు నగర, పట్టణ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం పోలీసులపై ఎంతైనా ఉంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో గస్తీ మరింత ముమ్మరం చేస్తేనే ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చని నగరవాసులు భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం..

లాక్​డౌన్ పరిస్థితుల వల్ల వాహన తనిఖీలు నిర్వహించలేకపోయాం. ఈ నేపథ్యంలో ఆకతాయిల చేష్టలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులున్నందున ఇకపై నగరంలో గస్తీ మరింత ముమ్మరం చేస్తాం. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్​లు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. వాహనాలు సీజ్ చేసి కేసులు పెడతాం. - వెంకట్​రెడ్డి, ఇంఛార్జ్​ ఏసీపీ, ఖమ్మం.

ఇవీ చూడండి:విషం తాగి బతికాడు.. చెరువులో దూకి చనిపోయాడు.

ABOUT THE AUTHOR

...view details