మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల ఆడబిడ్డల ప్రసవాలకు చిరునామాగా నిలిచిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రి కరోనా దెబ్బకు కకావికలమవుతోంది. పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందక రోగులకు కష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే ప్రధానాసుపత్రిలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది వైరస్ బారినపడగా... వారి ప్రైమరీ కాంటాక్టుగా ఉన్నవారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే కొవిడ్ సెంటర్, బాధితులకు ఐసోలేషన్ వార్డు ఏర్పాటుతో చికిత్స చేసేందుకు వైద్యసిబ్బంది, ఆస్పత్రికి వచ్చేందుకు రోగులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితితో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతుంటే... ఆస్పత్రిలో మరో విభాగం కొవిడ్ దెబ్బతో విలవిల్లాడుతోంది.
పూర్తిగా నిలిపివేసిన ప్రసూతి సేవలు...
ఖమ్మం ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోనే ప్రసవాల్లో ఇక్కడి ఎంసీఎచ్ ప్రథమస్థానం దక్కించుకుంది. రోజుకు 20 నుంచి 30 ప్రసవాలతో....... నెలకు దాదాపు 500 నుంచి 600 కాన్పులతో అగ్రభాగాన ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే నిరుపేదలకు భరోసానిస్తోంది. ఓవైపు కాన్పులు మరోవైపు రోజూ, నెలవారీ పరీక్షలకు వచ్చే గర్భిణులతో కళకళలాడే ఆస్పత్రిలో ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రసూతి సేవలను పూర్తిగా నిలిపివేశారు. అవుట్ పేషెంట్లకు మాత్రమే సేవలందిస్తున్నారు. కాన్పు కోసం వచ్చే వారిని మమత జనరల్ ఆస్పత్రికి సిఫారసు చేస్తున్నారు.