ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొంతమంది అధికారుల తీరుతో... వ్యవసాయ శాఖ పరువు బజారున పడుతోంది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ ప్రధానమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు జోరుగానే సాగుతున్నాయి. జిల్లాలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఖమ్మం జిల్లాలో మొత్తం 220, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 389 ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. మండల కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలు, ఖమ్మం నగరంలో ఏళ్ల నాటి నుంచి ఈ వ్యాపారం జోరుగానే సాగుతోంది.
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న దుకాణాలకు జిల్లావాసులే కాకుండా... సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాల నుంచి రైతులు ప్రతీ సీజన్లోనూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతీ సీజన్లో ఒక్క ఖమ్మం నగరంలోనే కోట్లలో వ్యాపారం సాగుతుంది. ఇవేకాకుండా మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ ఈ దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుకాణాల యజమానులు వ్యవసాయ శాఖ అధికారులకు గుడ్‌విల్ కింద ఏటా ఎంతో కొంత డబ్బు ముట్ట జెప్పుకోవాల్సిందే. ఈ ఆనవాయితీ ఏళ్ల నుంచీ కొనసాగుతూ వస్తోంది.
ఠంచనుగా వసూళ్ల పర్వం...
ఉభయ జిల్లాల్లోని దాదాపు అన్ని దుకాణాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు ఠంచనుగా మామూళ్లు వస్తూనే ఉంటాయి. వారి వ్యాపారాలను బట్టి, ప్రాంతాలను బట్టి అధికారులే ముట్టజెప్పాల్సిన మొత్తం నిర్ణయిస్తున్నారు. నగరం, పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న దుకాణాలను కేటగిరీల వారిగా విభజించి మరి వసూళ్లకు పాల్పడుతున్నారు. పెద్ద దుకాణాల నుంచి రూ.15,000 నుంచి రూ.30,000 వరకు వసూలు చేస్తున్నారు. చిన్న దుకాణాల నుంచి రూ.6000 నుంచి రూ.15000 వరకు ఏటా ముడుపుల రూపంలో అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇవే కాకుండా కార్యాలయంలో ఏ దస్త్రం కదలాలన్నా ముడుపుల్లేనిదే పని పూర్తికాదు.
సంతకానికింత.. పనులు కావలంటే అంత...
కొత్తగూడెం జిల్లాలోని ఓ మండల అధికారి వసూళ్ల పర్వం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్తగా లైసెన్సు కావాలంటే రూ.40 వేలు, రెన్యూవల్‌కు రూ.30,000, ప్రతీ దుకాణం నుంచి ఏటా రూ.6 వేలు అందించనిదే కుదరదని సదరు అధికారి తెగేసి చెబుతున్నారని సమాచారం. అంతేకాదు.. చంద్రగొండ మండల అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన తర్వాత ఎరువుల దుకాణాల యజమానుల నుంచి ఇప్పుడు నేరుగా ముడుపులు తీసుకోవడం మానేశారు. చాలా మంది అధికారులు ఈ వసూళ్ల పర్వాన్ని వివిధ పద్దతుల్లో సాగిస్తున్నట్లు సమచారం. దుకాణాల బిల్లులకు సంబంధించిన పుస్తకాలపై సంతకాలు చేయాలంటే రూ.2 వేలు, పీసీ సర్టిఫికెట్లకు రూ.2500 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. దుకాణాదారులకు ఎరువుల లోడ్ వస్తే రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో వివిధ పనుల కోసం రూ.2500 వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక లైసెన్సులు ఒకరిపేరు మీద ఉండి, మరో వ్యక్తి దుకాణం నడుపుకుంటే వారి నుంచి మరికొంత అదనపు మొత్తం ముట్టజెప్పాల్సిందే. ఒక అధికారి బదిలీ అయితే మండలంలోని అన్ని దుకాణాలకు సంబంధించిన ముడుపుల వివరాలు బాధ్యతలు తీసుకున్న కొత్త అధికారికి చేరుతాయి. వసూళ్ల పర్వం యథావిథిగా సాగుతుంది.