ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలతోపాటు మరో నాలుగు పురపాలికలకు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. వార్డుల పునర్విభజనపై పురపాలకశాఖకు లేఖ రాయడంతో... ఖమ్మంలోనూ అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. నగరపాలికలో ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా.. కొత్త పురపాలక చట్టం ప్రకారం డివిజన్ల సంఖ్య 60కి పెరగనుంది. ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారంతో డివిజన్లలో ఎంత మేర ఓటర్లు ఉండాలి. పెద్ద డివిజన్లలో ఓటర్ల సంఖ్యను ఎలా తగ్గించాలన్న అంశాలపై కసరత్తు చేసిన అధికారులు..పునర్విభజనపై ఆదేశాలు రాగానే... ప్రక్రియను మరిత ముమ్మరం చేయనున్నారు.
ఎన్నికల భేరికి సై
ఖమ్మం కార్పొరేషన్‌కు 2016 మార్చి 6నఎన్నికలు జరిగితే... మార్చి 15న కొత్త పాలకవర్గం కొలువుదీరింది. 2021 మార్చి 15తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే ఎన్నికల నగారా మోగుతుందన్న సమాచారంతో రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల భేరికి సై అంటున్నాయి. గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గానూ 34 స్థానాలు గెలుచుకున్న తెరాస.. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నగరపాలక సంస్థలో ప్రస్తుతం తెరాసకు 42 మంది కార్పొరేటర్ల బలం ఉంది. కాంగ్రెస్ 3, వామపక్షాలు-5, తెలుగుదేశం ఒకటి చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు.