ఖమ్మం జిల్లా ఆసుపత్రులతో పాటు యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీ, 24 గంటల ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ‘కొవిడ్’ విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజులుగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరంతా రక్షణ సామగ్రిని వినియోగించడంతో పాటు వ్యక్తిగతంగానూ అత్యంత జాగ్రత్తగా మసలుకుంటున్నారు. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, గ్లౌజ్‌లు, ఫేస్ షీల్డ్ మాస్క్‌లు ధరిస్తున్నారు. అయినా పనిచేసే చోట కొన్ని అసౌకర్యాలు, ప్రజల నిర్లిప్తత కారణంగా కొందరు ‘కొవిడ్’ బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆసుపత్రుల్లో అంతకంతకూ పెరుగుతున్న రద్దీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మండలస్థాయిల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు సుమారు 20 మంది వరకు అనుమానితులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. సుమారు 25 శాతం నుంచి 50 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలవరపరుస్తోంది. తక్కువ పరీక్షలు జరిపినప్పుడు 50 నుంచి వంద శాతం కొవిడ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
ఆపద్బాంధవులకు ప్రాణసంకటం
ప్రాణాపాయంతో వచ్చేవారిని ఆదుకునే ఆపద్బాంధవులు సైతం ఆపదలో చిక్కుకుంటున్న వైపరీత్యమిది. ప్రాణాలను పణంగా పెట్టి కరోనాతో పోరాటం సాగిస్తున్న వారి కుటుంబీకుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. దైవంతో సమానంగా భావించే వైద్యుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరిపై ఉంది. భౌతికదూరం, శానిటైజేషన్, మాస్కు ధారణ, అత్యవసరమైతేనే బయటకు రావడం ద్వారా మహమ్మారిని తరిమేస్తూ ఆ వైద్యనారాయణుల పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించాలి.
ప్రభుత్వాలు, వైద్యనిపుణులు ఎంత హెచ్చరించినా ఖాతరు చేయని కొందరు వ్యక్తుల కారణంగా మహమ్మారి సామాజిక దశలో వేగంగా వ్యాప్తిచెందుతోంది. క్రమంగా కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రులకు బారులుదీరుతున్న వైనం అక్కడి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లను.. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో వైద్యులు 21 మంది, స్టాఫ్ నర్సులు 47, ఇతర విభాగాల సిబ్బంది 83, ప్రైవేటు వైద్యులు 75, ప్రైవేటు ఆసుపత్రుల నర్సులు 80 మంది, సిబ్బంది మరో 95 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.
సిబ్బంది డిమాండ్లు ఇవీ..
- కొవిడ్ నిర్ధారణ, చికిత్స కేంద్రాల్లో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలి. బాధితులకు సేవలందించే వారి పనివేళల్లో మార్పులు తేవాలి.
- 24 గంటలు విధులు నిర్వర్తించాల్సిన తరుణంలో నాణ్యమైన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, ఇతర రక్షణ సదుపాయాలు సమకూర్చాలి.
- కొవిడ్ వారియర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న వారి కుటుంబాలకు సైతం ఆరోగ్య, ఆర్థిక ధీమా కల్పించాలి.
- సమాన పనికి సమాన వేతనంతో నియమితులైన ఉద్యోగులు సైతం రెగ్యులర్ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జరగరానిది జరిగితే ప్రభుత్వ పరిహారం, రక్షణ కల్పించాలి.
- బాధితులైన ఆశా వర్కర్ల స్థాయి నుంచి డీఎంహెచ్‌ఓ వరకు ఒకేస్థాయి మెరుగైన వైద్యాన్ని అందించాలి.
- పాజిటివ్ కేసుల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సిబ్బందికి సరైన రక్షణ సౌకర్యాలు కల్పించాలి.