ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడిది నిరుపేద కుటుంబం. రోజూ వాహనాలకు రేడియం స్టికర్లు వేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లికి, సోదరికి, యువకుడికి కూడా కరోనా సోకింది. ముగ్గురికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చైంది. చేతిలో చిల్లిగవ్వ లేక ఇంటి స్థలాన్ని అమ్మేశాడు.
బోనకల్ మండలం ముష్టికుంటకు చెందిన ఓ ఆర్ఎంపీకి... వైరస్ సోకింది. విజయవాడ, హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం... దాదాపు రూ.25 లక్షలకుపైనే వైద్యం చేశాడు. చివరికి ప్లాస్మాథెరఫీ చేయించినా ఫలితం లేదు. ఈ నెల 5న చనిపోయాడు.
నగరంలోని గాంధీ చౌక్‌కు చెందిన ఓ వ్యాపారికి వైరస్ సోకింది. అతని నుంచి ఇంట్లో 12మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ ఒక్క కుటుంబమే దాదాపు రూ.25 నుంచి 30లక్షల వరకు ఖర్చు చేసింది. అయినా కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ... మానసికంగా తీవ్రంగా కుంగిపోవాల్సి వచ్చింది.
కొడిజర్ల మండలంలోని ఓ ఆలయ పూజరికి నెల రోజుల క్రితం కరోనా సోకింది. 10 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్సకు రూ.9లక్షల వరకు దారపోశాడు. దీంట్లో రూ.6లక్షలు అప్పెనట. అరకొర సంపాదనతో నెట్టుకొచ్చే ఈ కుటుంబపై తీరని భారం పడిందిప్పుడు.
ఆర్థికంగా చితికిన బాధిత కుటుంబాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాధిత కుటుంబాలను కరోనా మహమ్మారి ఆగమాగం చేస్తోంది. అసలే కొవిడ్ భయంతో నిత్యం దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న బాధితుల్ని... పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా వణికిస్తోంది. ఎక్కువ శాతం మంది తమకెలా వైరస్ సోకిందో కూడా తెలసుకోలేని పరిస్థితి ఉంది. వైరస్ ప్రభావం మొదలైన తొలి నాళ్లలో కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితమై కరోనా... ఇప్పుడు పల్లెలను కూడా తాకింది. ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వేలాది మంది బాధితుల్లో దాదాపు 60 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనో, హోం ఐసోలేషన్లోనో ఉండి వైరస్‌ను జయించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినవారు మాత్రం లక్షల రూపాయలు ధారపోయాల్సి వచ్చింది. పిల్లల చదువులు, పెళ్లిల్లు, భవిష్యత్ కోసం పైసా పైసా కూడబెట్టుకున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితి బాధిత కుటుంబాలపై తీవ్ర ఆర్థిక ప్రభావమే చూపింది.
మందులు, పరీక్షల ఖర్చులే అధికం
కరోనా పాజిటివ్ వచ్చిన నాటి నుంచి కోలుకునే వరకు మందులు, పరీక్షలకే ఎక్కువ ఖర్చవుతోంది. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించినప్పటి నుంచి ఖర్చు మొదలవుతుంది. అక్కడ మళ్లీ ర్యాపిడ్, యాంటీజెన్, యాంటీబాడీ, ఆర్టీ-పీసీఆర్, హెచ్ఆర్. సీటీ స్కాన్ వంటి నిర్ధరణ పరీక్షలు చేస్తారు. పరిస్థితి ఆందోళనకరంగా మారి హైదారాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే... మళ్లీ అక్కడ ఇదే తంతు. ఇలా పరీక్షల రూపంలోనే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇక మందులకైతే లెక్కేలేదు. చీటీలో రాసిన మందులు తెచ్చివ్వడం తప్ప... మరో మాట్లాడే పరిస్థితి లేదు. చివరికి చూస్తే... లక్షల్లో వచ్చే బిల్లులు కరోనా కష్టాలకు సాక్షంగా నిలుస్తున్నారు.
కరోనా ఖర్చు కోట్లల్లోనే