పూర్వ ఖమ్మం జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గంధంపల్లికి చెందిన వెనిగళ్ల రవి, రేణుక దంపతులకు... సేవా కార్యక్రమాలు చేపట్టడం వారికి అభిరుచి. వెనిగళ్ల రవి ఇంజినీరింగ్ తర్వాత అనేక ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. 2000 వ సంవత్సరంలో అమెరికా పయనమయ్యారు. ఆరిగాన్ రాష్ట్రం పోర్ట్ ల్యాండ్ సిటీలో ఐటీ ఉద్యోగిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య రేణుక మరో ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2011లో స్వదేశానికి వచ్చిన సమయంలో స్వగ్రామంలో ఆర్థిక స్థోమత బాగోలేక ఇద్దరు కూతుళ్లను పాఠశాల మాన్పించిన దంపతులను చూసి చలించిపోయారు. చదవుల్లో ముందంజలో ఉన్న బాలికలను చూసి చదివించాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఒక అమ్మాయికి చదువు పూర్తయ్యే వరకు అయిన ఖర్చంతా భరించారు. అలా మరో కూతురును తల్లిదండ్రులు చదివించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. ఇలా ప్రారంభమైన వారి సేవా కార్యక్రమాల పరంపర నిరంతరంగా సాగుతుంది.
నిస్వార్థ సేవే ఏకైక లక్ష్యంగా..
అమెరికా వెళ్లిన తర్వాత సేవా కార్యక్రమాలపై తీవ్రంగా ఆలోచించిన వెనిగళ్ల రవి దంపతులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడంతోపాటు సేవా భావాన్ని చాటాలన్న లక్ష్యంతో 2016 డిసెంబర్ 24 న చేతన ఫౌండేషన్ పేరిట సేవలు ప్రారంభించారు. నిస్వార్థ సేవే ఏకైక లక్ష్యం నినాదంతో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జాతి, మత, కుల, భాష, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా కేవలం సమాజ సేవ కోసం ఆవిర్భావించిన చేతన ఫౌండేషన్ అందుకు అనుగుణంగానే సేవా తత్పరతను చాటిచెబుతోంది. దేశంలోని దిల్లీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు చేతన సేవలు విస్తరించారు. అంతేకాదు అమెరికాలోని 12 నగరాల్లో సేవలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్, అమెరికా, కెనడా, ఉగాండా, నైజీరియా దేశాల్లో సేవలు కొనసాగుతున్నాయి. చేతన ఫౌండేషన్‌ను 25 మంది మిత్రబృందం కలిసి నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి మంది వాలంటీర్స్ చేతన సేవల్లో భాగస్వాములయ్యారు.