ఒకవైపు కుళ్లి.. ఎండిన మొక్కలు. వాటి వెనుక మరోమారు మొలకెత్తి ఎదగని మొలకలు... వాటి మధ్య కొత్తగా గింజలు పెడుతున్న కూలీలు. గోదావరి పరీవాహకంలో ఏ చెలక చూసినా ఇవే దృశ్యాలు. గత నెలలో భారీవర్షాలు, గోదావరిముంపు రైతుల వెన్ను విరిచాయి. ప్రధానంగా కౌలురైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. మొక్క చనిపోతే మరో విత్తును నాటుతూ పోయారు. కనిష్ఠంగా ఐదెకరాల్లో సాగుచేసిన వారికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది పంట చేతికొచ్చే పరిస్థితులూ లేవని సాగుదారులు ఘొల్లుమంటున్నారు.
ఎకరాకు రూ.15వేల కౌలుతో..:భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గోదావరి పరీవాహకంలో పత్తి అధికంగా సాగవుతోంది. నదికి మోటార్లు పెట్టుకుని వరినీ పండిస్తుంటారు. పెద్దసంఖ్యలో కౌలు రైతులు కూడా సాగుచేస్తుంటారు. చెలకలకు భూ యజమానులు ఎకరాకు రూ.15వేలు కౌలు తీసుకుంటున్నారు. ఒక్కో రైతు కనీసం అయిదెకరాల వరకు కౌలుకు తీసుకుంటున్నారు. గత నెలలో 10వ తేదీ తరువాత భారీవర్షాలు, గోదావరి ముంపుతో పొలాల్లో నీటిఊట పెరిగింది. విత్తిన పంట, మొలకలన్నీ కుళ్లిపోయాయి. ఇప్పుడు సాగుకు అదును కూడా తప్పిపోయింది. ఈ ఏడాది కౌలు ఎలా చెల్లించాలా అని ఆందోళన చెందుతున్నారు.
విత్తుతూనే ఉన్నా..పత్తా లేదే..!:జూన్‌లో మొదటిసారిగా పత్తి విత్తనాలు నాటారు. మొక్కలు అడుగెత్తుకు వచ్చేసరికి జులైలో భారీవర్షాలు కురిశాయి. చెలకల్లో తేమ పెరిగి మొక్కలు కుళ్లిపోయాయి. వాటి స్థానంలో మరోమారు విత్తారు. అవి కొన్నిచోట్ల మొలకెత్తగా మరి కొన్నిచోట్ల అరడుగు వరకు ఎదిగాయి. ఇంతలో గోదావరి ముంపులో 4రోజులపాటు ఉండిపోవడంతో కుళ్లిపోయాయి. దీంతో గతనెలాఖరులో మరోమారు విత్తారు. ఒండ్రుమేటలు, తేమతో సరిగా ఎదగకపోవడం, మొలకెత్తకపోవడం వంటి సమస్యలొచ్చాయి. ఇపుడు విత్తనం లేనిచోట కొత్తగా నాటుతున్నారు. నాలుగుసార్లు విత్తనాలు వేసినందుకు దాదాపు రూ.లక్ష ఖర్చు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు.
ఈ ఏడాది సాగు కోసం జూన్, జులైలలో బ్యాంకులు, వ్యాపారుల వద్ద రుణాలు తీసుకున్నారు. రెండు, మూడుసార్లు పంటను కోల్పోయినవారు మళ్లీ ప్రయత్నించగా అప్పిచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. నగలను పెట్టి అప్పుతీసుకున్నవారూ ఇప్పుడేం చేయాలా అని ఆలోచనలో పడిపోయారు. ఈ క్రమంలో పంటల సాగుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పరిహారం అందించి వెంటనే తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.