ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కేంద్రంగా తండాలకు చెందిన ఓ 10 మంది ముఠా బీమా పరిహారం పేరిట అక్రమాలకు ఆజ్యం పోశారు. గతేడాది అక్టోబరులో కరోనా రక్షక్ బీమా పేరుతో ఓ వ్యక్తి రూ.2000 చెల్లించి పేరు నమోదు చేయించుకున్నారు. కరోనా బారినపడ్డ అనంతరం 72 గంటలు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది తగిన ఆధారాలతో బీమాకు దరఖాస్తు చేసుకోగా రూ.2.5 లక్షలు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఓ ముఠా.. భారీ మోసానికే తెరలేపింది. దుబ్బతండా, మేకలతండా, గంగారంతండా నుంచి 700 మందికి బీమా చేయించారు. ఒక్కొక్కరి నుంచి బీమా ప్రీమియం రూ.2300తోపాటు ఇతర ఖర్చులు రూ.2700 కలిపి రూ.5 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత వారి పేరిట కొవిడ్ బీమా పరిహారం కాజేసేందుకు పక్కా ప్రణాళికతో వ్యూహరచన చేశారు.
నిఘా వర్గాల ఆరా
కారేపల్లి మండలంలో సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంపై అటు నిఘావర్గాలు, ఇటు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. సూత్రధారులు ఎవరు? ముఠాలో మొత్తం ఎంతమంది ఉన్నారు? సభ్యులకు ఏం చెప్పి ఇందులోకి లాగారు? కుమ్మక్కైన ప్రయివేటు ఆసుపత్రులేంటి? అన్న అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీమా సంస్థ సైతం తదుపరి కార్యాచరణకు సిద్ధమైనట్లు తెలిసింది.
తిలా పాపం తలా పిడికెడు..
ఇప్పటికే 90మంది పేరిట పరిహారం కోసం నకిలీ పత్రాలతో దరఖాస్తులు చేయగా 30మంది ఖాతాల్లో బీమా సొమ్ము జమైంది. ఒక్కొక్కరికిరూ.2.5 లక్షల చొప్పున రూ.75 లక్షలు జమ కాగా ఈ మొత్తంలో రూ.45 లక్షలు ముఠా సభ్యులు నొక్కేశారు. సభ్యులకు రూ.లక్ష చొప్పున ఇచ్చి, మిగిలిన రూ.లక్షన్నర జేబుల్లో వేసుకున్నారు. బీమా విషయం ఈనోటా ఆనోటా తెలిసి తండాలు విస్తరించాయి. ఫలితంగా మేమంటే మేమంటూ దరఖాస్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. బీమా సభ్యుల సంఖ్య చివరకు 700కు చేరింది.
ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కు..