ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని... జిల్లాలకు విస్తరించి యువతకు ఉపాధి కల్పంచాలని ప్రభుత్వం సంకల్పించింది. సాంకేతిక ఫలాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్లో ఐటీ హబ్‌లు నిర్మించగా... ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.25 కోట్లు ఖర్చు చేసి ఆధునిక హంగులతో నిర్మించిన ఈ ఐటీ సౌధాన్ని... మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
విస్తరణ వేగవంతం..
42 చదరపు అడుగుల వైశాల్యంలో ఆరు అంతస్తులుగా ఐట హబ్‌ను నిర్మించారు. తొలిదశలో రూ.12.5 కోట్లు కేటాయించగా... రెండో దశ కోసం మరో రూ.12.5 కోట్లు వెచ్చింది దీనిని నిర్మించారు. మూడు, నాలుగు దశలకూ ఈ హబ్‌ను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుండగా... గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధితోపాటు జిల్లాలకు ఐటీ రంగ విస్తరణ మరింత వేగవంతమవుతుందని ఐటీ రంగ, ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఐటీ హబ్‌లో దాదాపు 16 బహుళ జాతి కంపెనీలు నమోదు చేసుకున్నాయి.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఐటీ హబ్ ప్రారంభోత్సవంతోపాటు నగరంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వస్తున్న మంత్రుల పర్యటన కోసం ఖమ్మం నగరం ముస్తాబైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రానున్న మంత్రులు... దాదాపు 4 గంటల పాటు ప్రత్యేక బస్సులో ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖానాపురం, రఘునాథపాలెం మినీ ట్యాంక్ బండ్లు, ధంసలాపురం రైల్వే వంతెన, పోలీస్ కమిషనరేట్ నూతన భవనం, పలుచోట్ల పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు ప్రారంభించనున్నారు. అనంతరం ఐటీ హబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు. మంత్రుల పర్యటనకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కేటీఆర్‌తోపాటు హోంశాఖ మంత్రి వస్తుండటం వల్ల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
భారీ ర్యాలీ..
ఖమ్మం నగర పాలక సంస్థకు త్వరలోనే ఎన్నికల నగారా మోగుతుందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో... కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు తెరాస శ్రేణులు సిద్ధమయ్యారు. డివిజన్ల వారీగా జన సమీకరణ చేయాలని పార్టీ భావిస్తోంది. నగరంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మంత్రులు వెళ్లే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి... మంత్రులు ప్రయాణించే బస్సు ముందు భారీ బైక్ ర్యాలీ చేపట్టి నగరంలో పర్యటన ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి:దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం: కేటీఆర్