తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల పోరుకు శరవేగంగా పావులు కదుపుతున్న పార్టీలు - ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు 2021

ఖమ్మం నగరపాలక ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ.. ఎన్నికల పోరుకు రాజకీయ పార్టీలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. ఖమ్మం, వరంగల్ నగరాలతోపాటు రాష్ట్రంలోని ఇతర పురపాలికలకు ఈనెల 30న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బల్దియా పోరులో.. సత్తా చాటడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. రెండోసారి పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార తెరాస ప్రణాళికలు రూపొందిస్తుంటే.. ఈ సారి సత్తా చాటాలన్న సంకల్పంతో కాంగ్రెస్, భాజపా, వామపక్షాలు సమాయత్తమవుతున్నాయి.

arrangements are going to complete for the Khammam corporation elections party's are busy in campaign
Khammam corporation

By

Published : Apr 11, 2021, 4:20 AM IST

ఎన్నికల పోరుకు శరవేగంగా పావులు కదుపుతున్న పార్టీలు

ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల పోరుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కార్పొరేషన్ లో ఇప్పటి వరకు 50 ఉన్న డివిజన్లు ప్రస్తుతం 60 కి పెరిగాయి. ప్రస్తుతం రిజర్వేషన్ల ఖరారులో కీలకమైన కులగణన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆదివారంతో కులగణన పూర్తికానుంది. అదేరోజు తుది ముసాయిదా ప్రకటించే అవకాశం ఉంది.14న తుది జాబితా వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఎన్నికల్లో ప్రధానమైన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం మూడ్రోజుల్లో పూర్తి కానుంది. ఈ మొత్తం ప్రక్రియ ఇంకా నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానుంది. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఉంది. అంటే ఉగాది తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 30 న ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సమాయత్తమవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే నగరపోరు ప్రక్రియలో నోటిఫికేషన్ విడుదల నుంచి.. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, పరిశీలన చకచకా జరిగిపోనున్నాయి. పోలింగ్ తేదీతోపాటు ఫలితాల వెల్లడి కేవలం 20 రోజుల్లోపే పూర్తి కానుంది. దీంతో ఇప్పటికే బల్దియా ఎన్నికల క్షేత్రంలోకి దిగిన రాజకీయ పక్షాలు జోరు మరింత పెంచుతున్నాయి.


తొలిదఫా ప్రచారాన్ని పూర్తి చేసిన అధికార తెరాస..

రెండోసారి అధికార పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా తొలిదఫా ప్రచారాన్ని పూర్తి చేసిన అధికార తెరాస ప్రచారపర్వాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని డివిజన్లలో సన్నాహక సమావేశాలు నిర్వహించడం, మాజీ కార్పొరేటర్ల ఆత్మీయ సమ్మేళనం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరంలో జరిగే తొలి ఎన్నికలు కావడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవలే ఖమ్మం పర్యటనకు వచ్చిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్..ఎన్నికలకు సిద్ధం కావాలంటూ నేతలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల కంటే ఈ సారి తెరాస పరిస్థితి భిన్నంగా ఉంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి భారీగా చేరికలు జరిగాయి. ప్రస్తుతం మరో 10 డివిజన్లు పెరగడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక కొంత తలనొప్పులు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.

సత్తా చాటేలా కాంగ్రెస్ అడుగులు..

ఈ సారి బల్దియా ఎన్నికల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అధినాయకత్వమంతా ఖమ్మం నగరంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోరుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే నగరంలో ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 60 డివిజన్లకు అధ్యక్షులను నియమించారు. డివిజన్ల వారీగా ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఈ ప్రక్రియ మరింత ఊపందుకోనుంది. నగర ఎన్నికలకు ప్రత్యేక మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తున్నారు.

ప్రత్యేక వ్యూహాలతో భాజపా..

నగర పోరులో అధికార పార్టీతో ఢీ కొట్టేందుకు ఈ సారి భాజపా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తోంది. భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిని ఇంఛార్జీగా నియమించింది. ఎన్నికల సమాయత్తతపై శుక్రవారం ముఖ్య నేతలు, డివిజన్ల బాధ్యులతో చింతల సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో పాటు కొందరు రాష్ట్ర నాయకులను సైతం ఇప్పటికే రంగంలోకి దించారు. రాష్ట్ర స్థాయి నేతలను డివిజన్లకు పర్యవేక్షకులుగా నియమించారు. సోమవారం నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలో డివిజన్ల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి ముఖ్య నేతలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు చేస్తుంది.

సై అంటున్న వామపక్షాలు..

నగర పోరుకు వామపక్ష పార్టీలు సైతం సై అంటున్నాయి. నగరంలో ఎంపిక చేసుకున్న డివిజన్లలో పోటీకి సీపీఐ, సీపీఎం పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పొత్తులపై ఆలోచిస్తున్న ప్పటికీ నోటిఫికేషన్ తర్వాతే తుదినిర్ణయం తీసుకున్నాయి. ఇక తెదేపా సైతం తమకు బలమున్న స్థానాల్లో పోటీకి సిద్ధమవుతుంది. ఇటీవలే ఖమ్మం నగరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన సైతం ఎన్నికల బరిలో నిలిచేలా కసరత్తు చేస్తుంది. ఇలా ఇప్పటికే నగరంలో రాజకీయ పోరు రసవత్తరంగా మారుతుండగా.. సాగర్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత నేతలంతా ఖమ్మంపై గురి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవీ చూడండి:రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ప్రభుత్వం ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details