తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపు ఖమ్మం వేదికగా వైఎస్‌ షర్మిల సంకల్ప సభ - తెలంగాణ వార్తలు

ఈ నెల 9న ఖమ్మం వేదికగా వైఎస్ షర్మిల నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు.. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సంకల్ప సభ పేరుతో నిర్వహించే సభకు భారీగా జనసమీకరణ లక్ష్యంగా ఆమె అనుచరులు, అభిమానులు కసరత్తులు చేస్తున్నారు. ఇదే వేదిక నుంచి కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాను షర్మిల ప్రకటించనున్నారు. మరోవైపు.. బహిరంగ సభకు కొవిడ్ ఆంక్షలు ఇబ్బందిగా మారాయని... షర్మిల వర్గం ఆరోపిస్తోంది.

arrangements are going on for Sharmila public meeting at Khammam
రేపు ఖమ్మం వేదికగా వైఎస్‌ షర్మిల సంకల్ప సభ

By

Published : Apr 7, 2021, 4:25 AM IST

దాదాపు 50 రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన వైఎస్ షర్మిల.. ఖమ్మం నగరంలో భారీ సభకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 9న ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు... ఆమె అనుచరగణం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయ జిల్లాల్లోని 10 నియోజకవర్గాల నుంచి భారీగా వైఎస్ అభిమానులను తరలించేలా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10నియోజకవర్గాలకు బాధ్యులను ఇప్పటికే నియమించారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయడంతోపాటు.. సభను విజయవంతం చేసేందుకు గానూ నియోజవర్గ బాధ్యులు కసరత్తులు చేస్తున్నారు.


అడ్డొస్తున్న కొవిడ్ నిబంధనలు..

ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి... రాత్రి 9 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించుకునేందుకు ఇప్పటికే ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు. కేవలం 5 నుంచి 6 వేల మంది వరకు సభలో పాల్గొనేలా... పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆంక్షలు విధించారు. బహిరంగ సభలో ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించారు. నిబంధనలు అంగీకరించి సభ నిర్వహణ కోసం సమాయత్తమవుతున్న తమకు.. కరోనా నిబంధనల పేరుతో అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని షర్మిల పార్టీ వ్యవహారాల బాధ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రోజుకో రకమైన ఇబ్బందులకు గురి చేస్తుందని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సంకల్ప సభ నిర్వహించి విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సభను జరుపుతామని.. ఇందుకోసం 500 మంది వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. షర్మిల ఖమ్మం గడ్డపై అడుగుపెడుతుందంటేనే.. తమ పునాదులు కదులుతాయని కొందరు భయపడుతున్నారని.. అందుకే సభకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఖమ్మం నుంచే శంఖారావం!

రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీ నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న షర్మిల... ఖమ్మం నుంచే శంఖారావం పూరించనున్నట్లు ఆమె అనుచరవర్గం చెబుతోంది. ఖమ్మం బహిరంగ సభ వేదిక నుంచే పార్టీ ప్రకటన, జెండా, ఎజెండా, పార్టీ విధి విధానాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండటంతో రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.



ఇవీ చూడండి:ప్రజాక్షేత్రంలో చెమటోడ్చుతున్న అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details