రేపు ఖమ్మంలో తలపెట్టిన వైఎస్ షర్మిల సంకల్ప సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సభా ఏర్పాట్లను షర్మిల అనుచరులు కొండా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. సంకల్ప సభకు విజయమ్మ సైతం హజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో తిరిగి రాజన్న రాజ్యం తెచ్చేందుకు షర్మిల పెట్టబోయే పార్టీ విధి విధానాలు, జెండా ..ఏజెండా పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని కొండా రాఘవరెడ్డి తెలిపారు.
దాదాపు 50 రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన వైఎస్ షర్మిల.. ఖమ్మం నగరంలో భారీ సభకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 9న ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు... ఆమె అనుచరగణం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయ జిల్లాల్లోని 10 నియోజకవర్గాల నుంచి భారీగా వైఎస్ అభిమానులను తరలించేలా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10నియోజకవర్గాలకు బాధ్యులను ఇప్పటికే నియమించారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయడంతోపాటు.. సభను విజయవంతం చేసేందుకు గానూ నియోజవర్గ బాధ్యులు కసరత్తులు చేస్తున్నారు.