Floods Effect at Bhadrachalam: ఏటా గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నా.. ఇంతలా ఏనాడూ ఉరకలెత్తలేదంటున్నారు నీటిపారుదల రంగం నిపుణులు, స్థానికులు. మహా ప్రవాహంలా సాగిపోయేదే కానీ జనావాసాలను తుడిచిపెట్టుకుని పోలేదంటున్నారు. గతంలో పోల్చితే తాజా వరదలప్పుడు వాగులా దూకిందని చెబుతున్నారు. ఈ వేగమే గోదావరి ఒడ్డు బిడ్డలను నిలువునా ముంచడంతో పాటు భారీ ఇళ్లు, రోడ్లు, కరెంటు స్తంభాలు, తాటిచెట్లనూ పెకిలించివేసింది.
నాటి విలయాన్ని మించి ఉప్పెన..గోదావరి వరదల చరిత్రను పరిశీలించినా, ఈ ప్రాంత వాసులను కదిలించినా 1986లో వచ్చిన భారీ వరదలు విలయాన్ని సృష్టించాయని చెబుతుంటారు. నాడు భద్రాచలం వద్ద గరిష్ఠంగా 75.6 అడుగుల మట్టం నమోదవగా నదిలో 32.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. ఈ నెల 16న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గరిష్ఠంగా 71.30 అడుగులకు నీటిమట్టం చేరగా 24.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. ఇలా దాదాపు 17 గంటల పాటు 71 అడుగులపైనే మట్టం కొనసాగింది. అయితే నదిలో ప్రవాహం వేగంగా కనిపించిందని, ఇది గతంలో ఎప్పుడూ లేదని వరదలను చూస్తూ వచ్చిన వారు చెబుతున్నారు. ఈ కారణంగానే కిలోమీటర్ల కొద్దీ విస్తరించినప్పటికీ ఉప్పెనలా ముంచి కొట్టుకుపోవడానికి కారణమై ఉండొచ్చంటున్నారు.
ఏకధాటి వర్షాలే కారణం..సెకనులో చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కురిసిన వర్షం స్థాయిని బట్టి వరద ప్రవాహం ఆధారపడి ఉంటుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతారు. ఈ నెల 11న ప్రారంభమైన వరదలు దాదాపు 16వ తేదీ వరకు కొనసాగాయి. మధ్యలో కుంభవృష్టిలా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒకటి, రెండు రోజులు కురిశాయి. దీనివల్ల కడెం నదితోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తింది. ఈ వరదే క్రమంగా 16నాటికి భద్రాచలానికి చేరేసరికి విస్తరించింది. అప్పటికే నదిలో ప్రవాహం ఉండగా భారీ వరద వచ్చేసరికి వేగం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. గోదావరి పరీవాహకంలో నిజామాబాద్ జిల్లా నుంచి మొదలు భద్రాద్రి జిల్లా వరకు నదికి ఇరువైపులా మైదాన ప్రాంతాలు భారీగా విస్తరించాయి. నది ఒడ్డున చెట్లు, పొదలు పూర్తిగా కనుమరుగయ్యాయి. జనాభా పెరగడంతో ఆవాసాలు నదికి సమీపంలోకి వచ్చాయి. ప్రహరీలు, రహదారుల నిర్మాణంతో పరీవాహకంలో ఒక అడ్డుకట్టలా మారాయి. వరద వెనక్కు మళ్లేందుకు అవి కారణమయ్యాయి. దీనికితోడు భద్రాచలం పట్టణంలోకి వరద రాకుండా నిర్మించిన కరకట్ట కూడా ప్రవాహాన్ని రెండోవైపునకు మళ్లేలా ఒత్తిడి పెంచి ఉంటుందని, అది క్రమంగా వెనక ప్రాంతాల్లోనూ ముంపునకు కారణమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు.