ఖమ్మం బల్దియా అభ్యర్థుల ప్రకటనలో అన్ని పక్షాలు అత్యంత గోప్యత పాటించాయి. ఓ వైపు ప్రచార పర్వం కొనసాగుతున్నా.. ఏ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. గురువారం సాయంత్రం వరకు ఇదే సస్పెన్స్ కొనసాగింది. ప్రధాన పార్టీలన్నీ నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ముగిసిన తర్వాతే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. అభ్యర్థులకు నేరుగా బీ-ఫారాలూ ఇవ్వలేదు. ఆయా పార్టీలకు చెందిన నాయకులే నేరుగా రిటర్నింగ్ అధికారులకు పార్టీ బీ-ఫారాలు సమర్పించారు.
బరిలో 252 మంది అభ్యర్థులు..
ఉపసంహరణ గడువు ముగిసే సరికి మొత్తం 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో మొత్తం 252 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం మొత్తం 155 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా 43వ డివిజన్లో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా 18, 25, 54 డివిజన్లలో ఇద్దరు చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. మిగతా అన్నిచోట్ల ముగ్గురికి మించి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తెరాస బోణీ..
20వ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ సతీమణి వసంతలక్ష్మి నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. పదో డివిజన్లో నామినేషన్లు దాఖలు చేసిన మిగతా ముగ్గురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో తెరాస అభ్యర్థిని చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమైంది. ఎన్నికలకు ముందే ఏకగ్రీవం రూపంలో ఒక స్థానాన్ని తెరాస తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి వంగవీటి ధనలక్ష్మి, ఆమె భర్త, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు 200 మంది మంత్రి పువ్వాడ సమక్షంలో తెరాసలో చేరారు.
ఎవరెవరు ఎన్ని స్థానాల్లో..
ఈ ఎన్నికల్లో తెరాస- సీపీఐ పొత్తుతో ముందుకెళ్తోంది. మొత్తం 60 డివిజన్లలో 57 స్థానాల్లో తెరాస అభ్యర్థులు, 3 స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్- సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 50, సీపీఎం 10 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపాయి. భాజపా- జనసేన పొత్తులో భాగంగా 52 స్థానాల్లోనే బరిలో నిలుస్తున్నాయి. మరో 9 స్థానాల్లో రెండు పార్టీల నుంచి అభ్యర్థులెవరూ నామపత్రాలు సమర్పించలేదు. భాజపా 47, జనసేన అభ్యర్థులు 5 చోట్ల పోటీలో ఉన్నారు. తెదేపా కేవలం 8 డివిజన్లలోనే పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా వెలువడడం వల్ల ఖమ్మంలో రాజకీయ వేడి మరింత పెరగనుంది. అన్ని పార్టీల వారు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
ఇవీచూడండి:రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు