తెలంగాణ

telangana

ETV Bharat / city

పిల్లల చదువుల కోసం భిక్షాటన చేస్తున్న తండ్రి - బిడ్డల చదువు కోసం తండ్రి బిక్షాటన

Father's Begging for Children's Education: ఇరవై ఏళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. భార్య మానసిక వికలాంగురాలు. కటిక పేదరికంలో జీవనాధారం కోసం... కూలి పనులు చేసినా శరీరం సహకరించక ఇంట్లోనే ఉండిపోయాడు. కానీ తన ఇద్దరు పిల్లల్ని పెద్ద చదువు చదివించాలన్నది అతడి కల. అందు కోసం భిక్షాటన చేస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతోనే పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నాడు. పెరిగిన ధరలతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందంటూ... ఆపన్నహస్తం కోసం అభ్యర్థిస్తున్నాడు.

father begging for his children s education
father begging for his children s education

By

Published : May 27, 2022, 3:29 AM IST

Updated : May 27, 2022, 6:53 AM IST

Father's Begging for Children's Education: ఖమ్మం గ్రామీణం మండలం పొన్నెకల్లుకు చెందిన కడియాల వెంకటేశ్వర్లు-జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. స్రవంతి 10 ఏళ్లు. అక్షయ్ 7 ఏళ్లు. గ్రానైట్ పరిశ్రమలో కూలీగా పనిచేస్తూ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పోషించేవాడు. రోడ్డు ప్రమాదం వీరి కుటుంబాన్ని... పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. ప్రమాదంలో వెంకటేశ్వర్లు రెండు కాళ్లు పోయాయి. ఈ ఘటనతో కుటుంబం రోడ్డున పడింది. భార్య జ్యోతి మానసిక వికలాంగురాలు. దీంతో.. కుటుంబ పోషణ వెంకటేశ్వర్లుకు భారంగా మారింది. భార్యాభర్తలు ఇద్దరికీ ఆసరా పింఛన్ అందుతున్నా ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. వెంకటేశ్వర్లుకు ఇప్పటివరకూ ప్రమాద బీమా అందలేదు. ఇల్లు నిర్మాణం కోసం చేసిన 2 లక్షల అప్పు తీర్చడం పెనుభారంగా మారింది. కూలి పనుల చేసేందుకు ఓపిక లేక కొన్నాళ్లు ఇంటికే పరిమితం అయ్యాడు.

భార్య మానసిక స్థితి బాగోలేకపోవడం వల్ల.. పిల్లలకూ అన్నీ తానయ్యాడు. పేదరికంతో మగ్గుతున్నప్పటికీ బిడ్డలను పెద్ద చదువులు చదివించాలన్నది వెంకటేశ్వర్లు ఆకాంక్ష. కానీ..రెండు కాళ్లు పోయి పనిచేసే శక్తిలేక వేదనకు గురయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను చదివించాలన్న కృతనిశ్చయంతో... భిక్షమెత్తేందుకు సిద్ధమయ్యాడు. పిల్లల చదువు కోసం జోలెపట్టి ఖమ్మం నగరాన్ని చుట్టేస్తున్నాడు. మూడేళ్ల నుంచి భిక్షాటన చేస్తూ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నాడు.

వెంకటేశ్వర్లు పరిస్థితి చూసి చలించిన ఓ పాఠశాల... స్రవంతికి 3ఏళ్ల పాటు ఉచితంగా విద్యను అందించారు. ఏడేళ్ల బాబు అక్షయ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇద్దరినీ పాఠశాలకు పంపేందుకు తండ్రి వెంకటేశ్వర్లు సిద్ధమవుతున్నా... ఆర్థికంగా శక్తి సరిపోవడం లేదు. భిక్షాటన చేస్తే వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు కొనడం... ఇంటి ఖర్చులకే సరిపోతుంది. పిల్లలను చదివించడం భారంగా మారిందంటూ... తండ్రి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రిని ఆర్థికంగా ఆదుకోండంటూ... ఆ చిన్నారి సైతం అభ్యర్థిస్తోంది.

దయార్ధ హృదయులు స్పందించి తన పిల్లల చదువుకు... భరోసా ఇవ్వాలని... కుటుంబ పోషణకు కిరాణ దుకాణం పెట్టుకునేందుకు సాయం చేయాలని వెంకటేశ్వర్లు చేతులు జోడిస్తూ వేడుకుంటున్నాడు. తమ చదువు కోసం తండ్రి పడుతున్న కష్టం చూసి... పిల్లలు తల్లడిల్లుతున్నారు. తమకు మంచి చదువులు చదువుకోవాలని ఉందని... దాతలు స్పందించి సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పిల్లల చదువుల కోసం భిక్షాటన చేస్తున్న తండ్రి

ఇవీ చదవండి:రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా..: సీఎం కేసీఆర్​

Last Updated : May 27, 2022, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details