Metpally Government school: జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 1966 లో అప్పటి ఖాదీ సమితి అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఈ పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో సుమారుగా 100 మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పాఠశాలకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో తరచూ తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి.
చిన్నపాటి వర్షం పడితే చాలు వాన నీరంతా తరగతి గదుల్లోకి చేరి విద్యార్థుల పుస్తకాలను తడిపి వేస్తున్నాయి. పాఠశాలలో ఎటు చూసినా ఊడిన పెచ్చులతో పాటు, ఇనుప చువ్వలు బయటకు తేలిన భయంకరమైన దృశ్యాలు సర్కారు పాఠశాలలో దర్శనమిస్తున్నాయి. భవనం చుట్టూ పెద్దపెద్ద వృక్షాలు ఉండడంతో ఈదురుగాలులు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక చెట్టు పాఠశాలపై పడటం.. విద్యార్థులు భయాందోళనకు గురికావడం పరిపాటిగా మారింది. గత నాలుగు రోజుల నుంచి భారీగా వర్షాలు కురవడంతో గోడలన్నీ పూర్తిగా తడిచిపోయి ప్రమాదకరంగా మారాయి.