భాజపా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ఈ ధరల పెంపుతో రైతులకు సాగు ఖర్చులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రం కుడి చేయితో ఇస్తే.. కేంద్రం ఎడమ చేయితో తీసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా స్త్రీనిధికి, బ్యాంకు లింకేజీకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నామని మంత్రి హరీశ్ అన్నారు. మాజీ మంత్రి ఈటల హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న హరీశ్.. నియోజకవర్గంలో మహిళా సమాఖ్య భవనాలు లేవని తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో అన్ని గ్రామాల్లో ఈ భవనాలు కట్టించానని చెప్పారు. ఇక్కడ ఎందుకు కాలేదో అర్థం చేసుకోవాలని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.
"హుజూరాబాద్ నియోజకవర్గానికి నిధులు ఇచ్చాం. ఇన్నాళ్లూ ఇక్కడ పనులు జరుగుతున్నాయని అనుకున్నాం. కానీ.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజులు ఇక్కడ అంతా బాగానే ఉందనుకున్నాం.. కానీ మేం వచ్చాక అర్థమైంది. మరికొన్ని రోజుల్లోగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నాది. రెండు పడక గదుల ఇళ్లకు నిధులు ఇచ్చినా.. నియోజకవర్గంలో ఒక్క ఇటుకా కదల్లేదు. ఇక నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం.. డబుల్ వేగంతో పరిగెడుతుంది. ఆసరా పింఛన్లు, వితంతు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు లబ్ధిదారులకు పక్కాగా అందేలా చర్యలు తీసుకుంటాం.