ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్న బడుగు బలహీన వర్గాల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతు బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన సీఎం.. ఇప్పుడు దళిత బంధు పథకాన్ని కూడా అక్కణ్నుంచే ప్రారంభించనున్నారని తెలిపారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
బడుగు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని మంత్రి గంగుల స్వాగతించారు. కరీంనగర్ అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పట్టించుకున్న నాథుడే లేడు..
70 ఏళ్ల నుంచి తెలంగాణలోని బలహీన వర్గాల ప్రజలను పట్టించుకున్న నాథుడే లేడని గంగుల అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత.. అన్ని వర్గాలతో పాటు కేసీఆర్.. ఎస్సీల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. దేశంలోనే దళితుల కోసం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిన ఏకైక సర్కార్ తెరాసదని కొనియాడారు.