రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డిజిటలీకరణలో భాగంగా వాటికి కొత్తతరం క్లౌడ్ ఆధారిత ఆటోమేషన్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని వినియోగాన్ని పరిశ్రమలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులోభాగంగా సాపియో అనలిటిక్స్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం దృశ్యమాధ్యమంలో జరిగిన కార్యక్రమంలో.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ప్రభుత్వ సహభాగస్వామి సంస్థ గ్లోబల్‌లింకర్ సీఈవో సమీర్ వాకిల్, సాపియో అనలిటిక్స్ సీఈవో అశ్విన్ శ్రీవాస్తవ సంతకాలు చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.72కోట్లు సాపియో సంస్థకు చెల్లిస్తుంది.
చిన్న పరిశ్రమలకు కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం..
తెలంగాణలో చిన్న పరిశ్రమల డిజిటలీకరణలో భాగంగా కొత్తతరం క్లౌడ్ ఆధారిత ఆటోమేషన్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సాపియో అనలిటిక్స్ సంస్థతో రూ.72 కోట్లు చెల్లించి ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి వీలుగా 20 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లైసెన్స్‌లు జారీ చేయనుంది. రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, జాబితాల నిర్వహణ తదితర కార్యకలాపాలకు దీన్ని వినియోగించుకోవచ్చు. ఆంగ్లంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉండే ఈ సాఫ్ట్‌వేర్‌ను వెబ్‌తోపాటు మొబైల్‌ఫోన్ల ద్వారా ఉపయోగించుకునే అవకాశమూ ఉంది.
‘‘రాష్ట్ర అభివృద్ధి, ఉపాధికల్పనలో కీలకపాత్ర పోషిస్తున్న చిన్న పరిశ్రమలు మరింతగా అభివృద్ధి చెందేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీని వినియోగంతో పరిశ్రమల రూపురేఖలు మారుతాయి’’అని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. 'చిన్నపరిశ్రమలను డిజిటలీకరించడం దేశంలో ఇదే ప్రథమమని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గ్లోబల్‌లింకర్.కాం వెబ్‌సైట్ ద్వారా ఆధునిక సేవలందుతున్నాయని చెప్పారు. అశ్విన్ మాట్లాడుతూ..ఈ సాప్ట్‌వేర్‌ను చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చని' సమీర్ వాకిల్ వెల్లడించారు.