తెలంగాణ

telangana

ETV Bharat / city

ఘనంగా నాగుల పంచమి... పుట్టల వద్ద మహిళల పూజలు

రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమిని పురష్కరించుకుని ఉదయం నుంచే మహిళలు పుట్టల వద్ద నాగదేవతకు పూజలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం, మాస్కులు ధరించి పూజలు చేస్తున్నారు. కొన్ని చోట్లు మాత్రం నిబంధనలు పాటించలేదు.

nagula panchami
nagula panchami

By

Published : Jul 25, 2020, 12:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో మహిళా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి నాగ దేవతలకు పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా జొన్న పేలాలు చల్లుతూ భక్తిభావాన్ని చాటారు. కొన్ని చోట్లు మాత్రం కొవిడ్ నిబంధనలు పాటించలేదు.

ఆదిలాబాద్‌ జిల్లాలో నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ క్షేత్రం నాగోబా సన్నిధానంలో కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్‌, జైనథ్‌, బేల, ఆసిఫాబాద్‌, బోథ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టల వద్ద పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముత్తైదువులు... ఒకరికి ఒకరు నోములు ఇచ్చుకున్నారు.

కరీంనగర్‌ ఆర్టీసీ వర్క్ షాప్ ఆవరణలో మహిళలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పుట్ట వద్ద పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలో ఉదయం నుంచే మహిళలు పూజలు ప్రారంభించారు.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలోని నాగదేవత అమ్మవారికి మహిళలు ఘనంగా అభిషేకం నిర్వహించారు. జహీరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే పుట్టలకు పూజలు చేస్తూ పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డిలో ఉదయం నుంచి మహిళలు పుట్టల వద్ద పాలు పోసి మెుక్కులు తీర్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details