కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ప్రభావం.. కూరగాయల రైతులు, విక్రయదారులపై తీవ్రంగా పడుతోంది. ఉదయం 6 నుంచి 10 వరకు ఆంక్షలు సడలించినా.. కొనుగోలుదారులు 8గంటల తర్వాతే వస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు తొమ్మిన్నరకే దుకాణాలు మూసివేయిస్తుండటంతో కూరగాయలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి ఎక్కువ ధరకు కూరగాయలు కొన్నా... విక్రయాలు జరగక పారేస్తున్నామని వాపోతున్నారు. మరో రెండు గంటలు సమయం(lockdown exemption) ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
అమ్ముకునే అవకాశం లేక..
వివిధ గ్రామాలకు చెందిన రైతులు కూరగాయలు విక్రయం కోసం కరీంనగర్ మార్కెట్(Karimnagar market) కు వస్తుంటారు. ఎంతో శ్రమపడి పండించి తీసుకొచ్చినా అమ్ముకునే అవకాశం లేక చెత్తకుప్పల్లో పడేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఉదయాన్నే కూరగాయల కొనుగోళ్లకు రావాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పురావట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. రద్దీకి భయపడి కొనుగోలు దారులు ఆలస్యంగా వస్తుండటంతో... 8 నుంచి 9గంటల మధ్య జనం భారీగా గుమిగూడుతున్నారు.