హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకంలో భాగంగా 12,521 లబ్ధిదారుల ఖాతాలో నగదు జమచేసినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. కార్లు, ట్రాక్టర్లకు ఆప్షన్లు ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయ స్కీములు ఎంపిక చేసుకోవాలని కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్ కలెక్టరేట్ దళితబంధుపై సమీక్ష నిర్వహించిన మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్.. దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మిగతా లబ్ధిదారుల ఖాతాల్లో వేగంగా దళిత బంధు డబ్బులు జమ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. దళితబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అయిన అందరికి సెల్ఫోన్లో తెలుగులో మెస్సేజ్ పంపించాలని మంత్రులు ఆదేశించారు. దళిత బంధు సర్వే సందర్భంగా అందుబాటులో లేని వారి కోసం ఈనెల 12నుంచి వారం రోజుల పాటు రీ వెరిఫికేషన్ నిర్వహించాలని ఆదేశించారు.దళిత బంధు పథకం కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. డబ్బులు వద్దని, తిరిగి ఇచ్చినందుకు మంత్రులు అభినందనలు తెలిపారు.