తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రముఖ నటుడు సోనూసూద్(Sonu Sood Phone call to Chandrababu) ఫోన్ చేశారు. చంద్రబాబును పరామర్శించారు. ఏపీ శాసన సభలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబుతో చెప్పారు.
ఉదయం రజనీకాంత్ ఫోన్..
ఇవాళ ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును ఫోన్లో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth phone call to cbn) పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని.. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూనందమూరి కుటుంబ సభ్యులుకౌంటర్ ఇచ్చారు. హద్దులు దాటి మాట్లాడొద్దంటూ.. తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయటం దారుణమన్న వారు.. తీరు మార్చుకోపోతే భరతం పడతామని హెచ్చరించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్షమాపణ చెప్పాలని, సంబంధిత నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందమూరి బాలకృష్ణ, స్వాతి, కల్యాణ్‌రామ్, నందమూరి జయశంకర కృష్ణ, గారపాటి లోకేశ్వరి, గారపాటి శ్రీనివాస్, నందమూరి వసుంధర, నందమూరి సుహాసిని, నందమూరి చైతన్యకృష్ణ, కామినేని సీమంతిని, కంఠమనేని ఉమామహేశ్వరి, శ్రీనివాస ప్రసాద్, నందమూరి జయశ్రీ రామకృష్ణ సహా పలువురు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాట్లాడారు.