కాలువలు నాలాల ఆక్రమణ పట్టణాల నీటి ముంపుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. సిరిసిల్ల నీటిలో మునగడానికి ప్రధానంగా కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని అధికారులు తేల్చి చెప్పారు. దీనికి ప్రధాన కారణమైన బోనాల శివారులో మొదలైన కాలువ అక్రమార్కులు పూడ్చివేయడంతో వెంకంపేట ధోబీఘాట్‌కు చేరేసరికి బాగా తగ్గిపోయింది. దీనితో కాలువలో నుంచి వచ్చిన వర్షపు నీరు సింహభాగం రోడ్లపైనే ప్రవహించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అయితే ఆ వరద రోడ్డెక్కి ఇళ్లలోకి రావడంతో దాదాపు రెండురోజుల పాటు నీటమునిగిన సామాన్లు ఇప్పుడు బురదతో నిండుకున్నాయి.
ఆక్రమణలకు ముందే అడ్డుకట్ట వేసి ఉంటే..
వెంకంపేట, ప్రగతినగర్, శివనగర్, అశోక్‌నగర్, పద్మానగర్, జయప్రకాశ్‌నగర్, అంబికానగర్, అనంతనగర్, సంజీవయ్యనగర్, సర్దార్‌నగర్ ప్రాంతాలను వరద పూర్తిగా ముంచేసింది. ఈ కాలువ ద్వారా వచ్చిన నీరు కొత్తచెరువుకు చేరుకొని నాలాల ద్వారా దామెరకుంటకు చేరాల్సి ఉంటుంది. కొత్త చెరువు కింద ఉన్న నాలాలు ఆక్రమణకు గురై ప్లాట్లుగా మారిపోయాయి. కొన్నిచోట్ల వాటిపై భవనాలు నిర్మించారు. దీనితో నాలాలు పూర్తిగా మూసుకుపోవడంతో చెరువులో నుంచి ఉప్పొంగిన నీరు రోడ్డెక్కి శాంతినగర్‌లోకి చేరడంతో ఇళ్లు మునిగిపోయాయి. ఫలితంగా కోట్లలో నష్టం వాటిల్లింది. అధికారులు ఆక్రమణలకు ముందే అడ్డుకట్ట వేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నీటమునిగిన ఇళ్లు ఇప్పుడిప్పుడే బయటికి తేలుతున్నా.. బురద కారణంగా సామానంతా పాడైపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.