గుండెపోటుతో మృతిచెందిన డ్రైవర్ బాబు అంతిమయాత్రను ఆరేపల్లిలోని ఆయన ఇంటి నుంచి కరీంనగర్ ఆర్టీసీ డిపో వైపు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస, వివిధ పార్టీల నేతలు యత్నించారు. డిపో వైపు వెళ్లేందుకు అనుమతి లేదని.. అంత్యక్రియలను బాబు ఇంటి సమీపంలోని శ్మశానవాటికలోనే పూర్తి చేయాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపో వైపు తీసుకెళ్తామంటూ ఎంపీ బండి సంజయ్, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను సంజయ్, కార్యకర్తలు బలవంతంగా తొలగించి ముందుకు దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత బాబు భౌతికకాయాన్ని పోలీసులు ఆయన ఇంటికి సమీపంలోని శ్మశానం వైపు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరీంనగర్లో ఉద్రిక్తం... ఎంపీ, ఐకాస నేతల ఆందోళన - ఎంపీ సంజయ్, ఐకాస నేతలతో పోలీసుల వాగ్వాదం
ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబసభ్యులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస, వివిధ పార్టీల నేతలను పోలీసులు అడ్డుకునే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది.

అంతిమయాత్రను అడ్డుకున్న పోలీసులు... ఎంపీ సంజయ్, ఐకాస నేతల ఆందోళన
పోలీసుల తీరును నిరసిస్తూ కరీంనగర్లో ఎంపీ సంజయ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతోపాటు ఆర్టీసీ ఐకాస నేతలు, విపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు.
Last Updated : Nov 1, 2019, 5:52 PM IST