Peoples trouble with monkeys: పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మంకీ ఫుడ్ కోర్టులు పెద్దఎత్తున ఏర్పాటు చేసినా... కోతులు మాత్రం పట్టణాల వైపే పరుగులు తీస్తున్నాయి. వానరాల భయానికి... రైతులు పండ్లు, కూరగాయలు కాకుండా కేవలం వరి పంట మాత్రమే వేస్తున్నారు. వాటికి ఆహారం కరవై.. కోతుల దండు సమీప పట్టణాలపై దండయాత్ర చేస్తోంది. ఇటీవల మున్సిపాల్టీగా మారిన సుల్తానాబాద్ ప్రజలను కోతులు బెంబేలెత్తిస్తున్నాయి.
గాంధీనగర్, పాతవాడ, శ్రీరామ్‌నగర్, స్వప్నకాలనీ, జవహర్‌నగర్, ఎస్సీ కాలనీ, గౌడ వీధి, అశోక్‌నగర్ కాలనీల్లో కోతులు రాత్రిపగలు అనే తేడా లేకుండా సంచరిస్తున్నాయి. మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చేతికందిన వస్తువును పట్టుకెళ్లడమే కాదు... అడ్డుకుందామంటే తిరిగి దాడి చేస్తుండటం జనాన్ని కలవరపెడుతోంది. దుస్తులు ఉతుకున్నప్పుడు, గిన్నెలు శుభ్రం చేస్తున్నప్పుడు, ముగ్గులు వేస్తున్నప్పుడు... మహిళలపై వానరాలు దాడికి పాల్పడుతున్నాయి.
రెండు నెలల వ్యవధిలో సుల్తానాబాద్‌లో వంద మంది మహిళలు... కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాత ఇంటి గూన పెంకులు, ఇళ్ల రేకుల పైకప్పులు పీకి పందిరి వేస్తున్నాయి. ఆరేసిన దుస్తులను చింపి... చిందర వందర చేస్తున్నాయి. తలుపు తీసి ఉంటే చాలు... ఇంట్లోకి చొరబడి చేతికందిన వస్తువును కాజేస్తున్నాయి. దుకాణాలు నిర్వహించే చిరు వ్యాపారులు నిత్యం కోతుల బెడదతో అల్లాడిపోతున్నారు. సరుకులను ఎత్తుకెళ్తున్నాయని వాపోతున్నారు.
కోతి చేష్టలకు విసుగెత్తిన జనం... రోజూ కర్రలు చేతపట్టి గస్తీ కాస్తున్నారు. వానరాలను తరిమికొట్టేందుకు కొందరు టపాకాయలు కాలుస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా... త్వరలో కౌన్సిల్ ఆమోదంతో కోతులను పట్టి కార్యక్రమాన్ని మొదలుపెడతామని... వానరాలను అడవుల్లో వదిలేస్తామని మున్సిపల్ కమిషనర్ నరసింహ చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కోతులను... తక్షణం బంధించి.. వాటి చెర నుంచి ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
వా'నరకం'... అక్కడ బయటికి రావాలంటే చేతిలో కర్ర ఉండాల్సిందే.! ఇవీ చదవండి: