పెద్దపల్లి జిల్లా రామగుండంలో స్థానిక సమస్యలు పరిష్కరించడంలేదని ఓ కార్పొరేటర్‌పై ఓటర్లు తిరగబడ్డారు. నగరపాలక సంస్థ 14వ డివిజన్ లక్ష్మిపురంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. వారిని ఓ సమస్య తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుండడంతో దానిపై ప్రశ్నించగా.. కార్పొరేటర్ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామగుండం నగరపాలక సంస్థ 14వ డివిజన్ లక్ష్మిపురంలో కొద్ది రోజుల క్రితం ఓ కుక్క చనిపోయింది. అది కుళ్లి దుర్గంధం వెదజల్లుతుండడంతో ఆ కంపు భరించలేక దానిని తొలగించాలని కార్పొరేటర్‌కు విన్నవించారు. దానికి కార్పొరేటర్ మీరే ఒక్కొక్కరు 50 రూపాయలు వేసుకొని తొలగించుకోండంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. దాంతో ఆగ్రహించిన స్థానిక ప్రజలు కార్పొరేటర్ నీల పద్మ ఇంటికి వెళ్లి నిలదీశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు.