కరీంనగర్‌లో చేపడుతున్న ప్రధాన మురుగు కాల్వల పనుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అధికారుల అలసత్వం.. గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా సాధారణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు నిలిచిపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. కాల్వల పక్కనే ఉన్న దుకాణాల యాజమానులు అవస్థలు పడుతున్నారు. అటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. సుందరీకరణ దేవుడెరుగు.. కనీస అవసరాలు తీర్చాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
సొంత ఖర్చులతోనే..
కరీంనగర్ నగర పరిధిలో రూ. 105 కోట్లతో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్ల విస్తరణతో పాటు మురుగు కాల్వల పనులూ ప్రారంభమయ్యాయి. నగరంలో 20 లోతట్టు ప్రాంతాలుండగా.. 25 కిలోమీటర్ల వరద కాల్వలు,148 కిలోమీటర్లు కచ్చా డ్రైనేజిలు ఉన్నాయి. అయితే వర్షం భారీగా కురిసినప్పుడు పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కాల్వల నుంచి వర్షపు నీరు వెళ్లక పోవడం వల్ల ఆ నీరంతా ఇళ్లలోకి చేరుతున్న క్రమంలో కాల్వల విస్తరణ చేపట్టారు.
ఇందులో ఎక్కువ శాతం మురుగు కాల్వ పనులు ఉండగా ఆయా నిర్మాణాలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలుచోట్ల మురుగు కాల్వల కోసం గోతులు తవ్వి వదిలేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పనులను అసంపూర్తిగా వదిలేశారు. కొన్ని చోట్ల కాల్వల పనులు పూర్తయినా వాటిపై శ్లాబులు వేయకుండా వదిలేస్తున్నారు. ఫలితంగా అక్కడున్న దుకాణ, ఇంటి యజమానులు అవస్థలు పడుతున్నారు. రాకపోకల కోసం సొంత ఖర్చులతో చెక్కలు అమర్చుకుంటున్నారు.
ఇళ్లల్లోకి నీరెక్కడొస్తుందోనని..
వర్షం వస్తే తమ ఇళ్లలోకి నీరు ఎక్కడ వస్తుందోనని... జ్యోతినగర్, విద్యానగర్, ఆమెర్నగర్, హుస్సేనిపుర, రాంనగర్, కోతిరాంపూర్, కమాన్ కూడలి, మారుతీ నగర్, పాత బజార్, గాంధీరోడ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అంబేడ్కర్ స్టేడియం ఎదురుగా వరద కాల్వ పనులు ప్రారంభించి అయిదేళ్లు పూర్తి కావొస్తున్నా.. ఇంకా కొలిక్కి రాలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వాగులెక్క తయారైంది..
షాపుల ముంగట తవ్విన్రు. పోయిన సంవత్సరం ఏప్రిల్లో చేశారు. ఇప్పటి వరకు ఇటువైపు చూసే దిక్కు లేదు. ఆఖరికి వాగులెక్క తయారైంది. వర్ష కాలంలో వానొచ్చి మొత్తం ఆగిపోయి.. దోమలు కాటేస్తున్నాయి.
-వస్త్రవ్యాపారి, గాంధీరోడ్, కరీంనగర్.
పట్టించుకొనే నాథుడే లేడు..