మొక్కలు పెంచడమే కాదు.. అక్కడికి వచ్చే వారికి ఆ మొక్కలతో అనుబంధం పెరిగేలా కరీంనగర్ పోలీసులు పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకేచోట రెండు మియావాకి(miyawaki forest) అడవులు పెంచి ప్రత్యేకత చాటుతున్నారు. ప్రతివ్యక్తికి జన్మనక్షత్రం, రాశి, గ్రహాల పట్ల ఆసక్తి ఉంటుంది. అందుకే.. నగర పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఏ మొక్క నాటితే శ్రేష్టమో.. ఏ రాశి వారికి ఏ చెట్టు మంచి కలిగిస్తుందో తెలిపేలా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు.
ప్రస్తుతం ప్రజలు ఉదయపు నడకకు అత్యంత ప్రాధాన్యతనిస్తుండటం వల్ల పోలీస్ శిక్షణా కేంద్రంలోని రెండున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌లో ప్రజలకు అనుమతిస్తున్నారు. ఈ ట్రాక్‌లోకి అడుగు పెట్టగానే అక్కడి చెట్లు వాకర్స్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా నక్షత్ర, నవగ్రహ, రాశివనాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. తొమ్మిది గ్రహాలు.. ఆ గ్రహాల వారు ఏ చెట్టు నాటితే శ్రేయస్కరమో వివరిస్తూ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. చెట్టుకు సంబంధించి వ్యవహారిక నామంతో పాటు శాస్త్రీయ నామాన్ని తెలుగు, ఆంగ్లంలో బోర్డుపై వివరించారు.
- ఇదీ చదవండి :సుందరం.. పచ్చదనం యాదాద్రి ఆలయం