తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి గంగులను ప్రశ్నించిన విద్యార్థి.. ప్రిన్సిపల్​కు వార్నింగ్​..! - స్సారార్​ కళాశాల ప్రాంగణం

కరీంనగర్​లో కళాభారతి నూతన భవన నిర్మాణం చేపట్టే స్థలం విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎస్సారార్​ కళాశాల ప్రాంగణంలోని స్థలంలో కళాభారతి నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేయగా... మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్​తో సహా విద్యార్థులు.. మంత్రి ఎదుట అనాసక్తతను వెల్లిబుచ్చారు. ఈ క్రమంలో వారి పట్ల మంత్రి, కలెక్టర్ వ్యవహరించిన​ తీరుపై విమర్శలు వినబడుతున్నాయి.

minister-gangula-fire-on-karimnagar-srr-principal-and-students
minister-gangula-fire-on-karimnagar-srr-principal-and-students

By

Published : Jul 9, 2021, 7:05 PM IST

మంత్రి గంగులను ప్రశ్నించిన విద్యార్థి.. ప్రిన్సిపల్​కు వార్నింగ్​..!

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్​ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్​తో సహా విద్యార్థులపై మంత్రి గంగుల కమలాకర్​ అసహనం వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో నిర్మించ తలపెట్టిన కళాభారతి విషయంలో ప్రిన్సిపల్​, విద్యార్థులు అభ్యంతరం తెలపగా... మంత్రితో పాటు కలెక్టర్​ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలోని నడిబొడ్డున ఉన్న కళాభారతి భవనం శిథిలావస్థకు చేరుకోగా.. నూతన భవనాన్ని నిర్మిస్తామని... రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఏడేళ్లు గడుస్తున్నా... కళాభారతి నూతన భవనానికి పునాది పడలేదు. ప్రస్తుతం ఆ దిశగా.. అడుగులు పడుతున్నాయి.

వేరే నిర్మాణాలకు కళాశాల స్థలమా..?

కలెక్టర్​ శశాంక, మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ క్రాంతితో కలిసి మంత్రి గంగుల కమలాకర్​.. ఎస్సారార్​ కళాశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. కళాశాల ఆవరణలో కళాభారతి నిర్మాణాన్ని చేపట్టటం తమకు ఇష్టం లేదన్న విషయాన్ని మంత్రికి ప్రిన్సిపల్ రామకృష్ణతో పాటు విద్యార్థులు తెలియజేశారు. ఓ విద్యార్థి మరో అడుగు ముందుకేసి... కళాశాలకు సంబంధించిన స్థలాన్ని వేరే నిర్మాణాలకు వాడుకోవటమేంటని మంత్రిని నిలదీశాడు. ఇప్పటికే కళాశాల కాంపౌండ్లో విద్యుత్ సబ్​స్టేషన్, వాటర్ ట్యాంకు నిర్మాణాలు చేపట్టారని.. ఇప్పుడు కళాభారతి పేరుతో మరింత స్థలాన్ని తీసుకోవటం సరికాదని తెలిపాడు.

విద్యార్థిపై మంత్రి ఆగ్రహం...

మొదట వివరించేందుకు ప్రయత్నించిన మంత్రి... విద్యార్థి నిలదీయటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దని మందలించాడు. విద్యార్థిని అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులకు చెప్పాడు. ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణను కలెక్టర్​ శశాంక హెచ్చరించారు. సదరు స్థలం స్పోర్ట్స్ స్కూల్​కు సంబంధించిన విషయమని... ఇందులో జోక్యం చేసుకోవద్దని ప్రిన్సిపల్​కు కలెక్టర్​ సూచించారు.

మంత్రి తీరుపై విద్యార్థుల అసహనం...

మంత్రి గంగుల కమలాకర్ తీరుపై విద్యార్థులు అసహనానికి గురయ్యారు. పోలీసులతో బలవంతంగా వెనక్కి పంపించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళాశాల స్థలాన్ని వేరే నిర్మాణాల కోసం వాడుకోవటం వల్ల క్రీడా ప్రాంగణాన్ని కోల్పోతున్నామని... దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. విద్యార్థులకు సమాధానం చెప్పేంత ఓపిక కూడా మంత్రికి ఉండకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

అసలు విషయమేమిటంటే...!

కళాశాల ప్రాంగణంలోని.. ప్రస్తుతం కళాభారతి నిర్మించే స్థలాన్ని గతంలో క్రీడా పాఠశాలకు ఇచ్చారు. పనులు కూడా మొదలు పెట్టారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల... స్పోర్ట్​ స్కూల్​ను డ్యాం వద్ద నిర్మించారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న ఆ స్థలాన్ని ఇప్పుడు కళాభారతి కోసం ఉపయోగించుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి, అధికారులు.. ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చారు. కానీ... కళాభారతి నిర్మాణం వల్ల అక్కడున్న ఫుట్​బాల్​ కోర్టుతో పాటు క్యాంటిన్​ స్థలం కోల్పోవాల్సి వస్తుందని కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: DRUNKEN DRIVER: కృష్ణగాడి వీర డ్రైవింగ్​ గాథ... మద్యం మత్తులో..

ABOUT THE AUTHOR

...view details